చలానాలను తప్పించుకునేందుకు….నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చట్టరీత్యా నేరం
▪️మద్యం తాగి వాహనం నడిపితే జైలుకే
▪️మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రుల పై కేసులు
▪️హుస్నాబాద్ ఎస్.ఐ. తోట మహేశ్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలను నివారించాలని, చలానాలను తప్పించుకునేందుకు నెంబర్ ప్లేట్లు ట్యాంపరింగ్ చేయవద్దని అలా చేసే వారి పై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హుస్నాబాద్ ఎస్.ఐ. తోట మహేశ్ అన్నారు. పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో గురువారం పోలీసు సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా డ్రండ్ అండ్ డ్రైవ్, ట్రిబుల్ రైడింగ్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ పేపర్ లేకుండా నడుపుతున్న వాహనాదారులను ఆయన తనిఖీ చేసారు. ఆనంతరం ఎస్.ఐ.తోట మహేశ్ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనల పై, చలానాలు తప్పించుకునేందుకు వాహనాల నెంబర్ ప్లేట్లను వంచేసి, మాస్కులు తగిలించేసి, నంబర్ సరిగా కనిపించకుండా చేయడం తదితర ట్యాంపరింగ్ చేస్తే చర్యలు చేపడుతామన్నారు. నేరం చేసిన వారు తమ వాహనాలను గుర్తించకుండా నంబర్ ప్లేట్లను ట్యాంపరింగ్ చేస్తుంటారని, సీసీ కెమెరాలకు దొరకకుండా వాహనాలను గుర్తించకుండా తప్పించుకునేందుకు యత్నిస్తుంటారని ఆయన తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ను ధరించాలని ఆయన సూచించారు.

రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది హెల్మెట్ లేకపోవడం వల్లనే ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన అందోళన వ్యక్తం చేసారు. కారులో ప్రయాణించినపుడు సీటు బెల్ట్ ధరించాలన్నారు. మద్యం తాగి వాహనం నడిపితే జైలుశిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు. మద్యం తాగి వాహనం నడిపే వారు అమాయకుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తు న్నారని ఆయన తెలిపారు. మైనర్లు వాహనాలు నడిపితే మొదటిసారిగా కేసులు నమోదు చేస్తామని, మరోమారు పట్టుబడితే మైనర్ తల్లిదండ్రులు, వాహన యజమాని పై కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. రోడ్డు పై ప్రమాదాలను నివారించడానికి చిరు వ్యాపారులేవరూ కూడా రోడ్డు పై కూరగాయలు అమ్మరాదని ఆయన సూచించారు. పోలీసులు ఎప్పుడూ పౌరసమాజానికి మంచి స్నేహితులని, మంచి చేసిన వారికి అండగా ఉంటూ… చేడు చేసిన వారికి కచ్చితంగా శిక్ష ఉంటుందన్నారు.
