జర్నలిస్టులు ఎంత క్లోజ్ అయినా…”క్లోజ్”
సిద్దిపేట టైమ్స్ వెబ్ డెస్క్:
సాక్షాత్తూ పాలనాధిపతి పేరు పెట్టి పిలిచేంతటి “క్లోజ్” జర్నలిస్టులైనా, తదుపరి సత్వర పీఠం మీద ఉన్న ఉప పరిపాలనాధీశుడికి సదరు ప్రముఖ చానల్ ఓనర్ మరీ క్లోజ్ అయినప్పటికీ, క్లాజ్ (చట్టాల్లో నిర్దిష్ట విభాగం/నిబంధన)ను ముట్టుకొని, పట్టుకొనే పూర్వరంగం ప్రేరేపించాలే కానీ ఆగనే ఆగరు. పండుగల అనుభూతి అనే సెంటిమెంట్ భరిత సున్నితత్వం, సమయం, సందర్భం వగైరా ఏ ఒక్కటీ ఆపలేవు. తెలంగాణలో పాలక పక్షం ఏదైనా జర్నలిస్టుల పట్ల అవ్యాజమైన ప్రేమ, అభిమానం అంటూ ఉండేదీ, లేనిదీ అనుభవంలోనే తెలుస్తుంది. ఒక్క వాక్యంలో పేర్కొనాలంటే పాత్రికేయుల పట్ల పైకి ఎంత చెప్పినా మమ”కారం” ఇమిడే ఉంటుందా? తెలంగాణలో నంబర్ వన్ స్థానం కోసం తపస్సు చేసే ప్రముఖ తెలుగు న్యూస్ చానల్ ప్రసారాల వివిధ దశల్లో సంయమనంలో ఎక్కడ లోటు లేకుండా జాగ్రత్త పడినా ఈ పరిస్థితి ఉత్పన్నం కాకపోయేదే! ఆ ఒక్క అంశంపై వ్యాఖ్యను ఏదో ఒక స్థాయిలో ప్రేక్షకులకు చేరకుండా నిలువరించినా, ఎయిర్ లోకి పోకుండా పరిహరించినా ఈ కలవరం ఉండేది కాదు. ఆల్రెడీ మీడియాలోనూ భిన్న ద్రువాలు, దృక్పథాలు సెటిలైన తెలంగాణలో ఈ వివాదం మీద సహజంగానే రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కేసు, అరెస్టులు, తనిఖీల వరుస క్రమం ఒక్కసారిగా గంభీరం చేసేసింది. ఫిర్యాదీలు నిశితంగా గమనిస్తున్నారు.
సదరు అంశంపై పోలీసు యంత్రాంగంలో కదలికల ముమ్మరం, పాలకుల్లో ప్రస్తుతానికి గుంభనం చూస్తున్నాం. నిజానికి సదరు వార్తా చానల్ పట్ల ప్రస్తుత ప్రభుత్వ మొదటి, రెండో పెద్దలు ఇద్దరికీ కోపతాపాలు ఏమీ లేవనేదే అబ్జర్వేషన్! యజమాని పలుకుబడి, చనువు ప్రకారం ఆ చానల్ కు ఏమంత ఆపద ఉండదనే భావన మరీ వికారం కాబోదు. కానీ, ఎటువంటి పరిస్థితులు, స్థితిగతులు “అనివార్యం” చేశాయో ఏమో? కథనాలు కథనాలుగా ఒక సెక్షన్ మీడియా మాత్రం పరిచేస్తోంది. సరిగ్గా సంక్రాంతి ముంగిట అనూహ్య కుదుపు ఆ చానల్ యంత్రాంగం అనుభవంలోకి వచ్చింది. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఉనికిలోకి తేవడం, ప్రాథమికంగా ముగ్గురు జర్నలిస్టులను అదుపులోకి తీసుకోవడం, కార్యాలయం తనిఖీల్లో సర్వర్ రూమ్ “క్లోజ్” చేస్తామనే పద శబ్దం ఒకటెనక ఒకటి చకచకా ధ్వనించాయి. అరెస్టు త్రయంలో ఇద్దరు జర్నలిస్టులైతే స్వయానా ముఖ్యమంత్రికీ బాగా తెలిసిన వారే. టైం వస్తే ఎవరి మీదయినా వార్తలు ఎట్లా వస్తాయో, జర్నలిస్టులకూ చిక్కులు అలానే తప్పవా? అనే వేదాంతం పొడసూపుతోంది. ఈ వ్యవహారం మొత్తం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో, మున్ముందు ఎవరి వంతు వస్తుందో, మరే విధంగానైనా చల్లబడుతుందా? చూడడమే మిగిలింది.
ఫైలింగ్:
ఇల్లెందుల దుర్గాప్రసాద్,
సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్,
హైదరాబాద్
9440850384



