హుస్నాబాద్ లో నూతనంగా నిర్మించిన రైతు బజార్ ప్రారంభం
ప్రజాప్రతినిధుల చేతులమీదుగా ప్రారంభోత్సవం – రైతుల ఆనందం

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
హుస్నాబాద్ పట్టణంలోని శివాజీ నగర్‌లోనీ బురుజు వద్ద మూడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన రైతు బజార్‌ను సోమవారం ప్రజాప్రతినిధులు ఘనంగా ప్రారంభించారు. నేటి నుంచి వ్యాపారస్థులకు అందుబాటులోకి రావడంతో సంతోషం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు బజార్‌లోని స్టాళ్లను సందర్శించి రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి మాట్లాడుతూ –“రైతుల కష్టానికి సరైన గౌరవం ఇవ్వడం ప్రభుత్వ లక్ష్యం. మూడు కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ రైతు బజార్ రైతుల ఆదాయాన్ని పెంచడమే కాకుండా వినియోగదారులకు కూడా నాణ్యమైన పంట ఉత్పత్తులు అందిస్తుంది,” అన్నారు. వ్యాపారస్థులు రైతు బజారులోనే అమ్మకాలు, కొనుగోలు జరపాలని సూచించారు. పట్టణ ప్రజలు రైతు బజారును వినియోగించుకోవాలని కోరారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి మాట్లాడుతూ, “రైతులు ఇకపై మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా వినియోగదారులకు అమ్ముకునే అవకాశం లభిస్తోంది. ఈ బజార్ ద్వారా రైతులకు న్యాయమైన ధరలు లభిస్తాయి” అని చెప్పారు.
సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య మాట్లాడుతూ, బజార్లో పార్కింగ్, తాగునీరు, చల్లని నిల్వ సదుపాయాలు, మహిళా విక్రేతలకు ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బంక చందు, మాజీ ఎంపీపీ ఆకుల వెంకన్న, చిత్తారి రవీందర్ పాల్గొన్నారు.





