బాండ్ పేపర్ పై సంతకం చేసి సర్పంచ్ గా పోటీ చేయాలి..
సర్పంచి అభ్యర్థులకు యువత షరతు..
సిద్దిపేట టైమ్స్, నంగునూరు, అక్టోబరు 9:
సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో యువత ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకుంది. సర్పంచ్ స్థానానికి పోటీ చేసే అభ్యర్థులు సర్పంచిగా ఎన్నికైతే అక్రమంగా ఆస్తులు సంపాదించనని, గ్రామ పంచాయతీ ద్వారా ప్రజలకు అందించాల్సిన సేవల కోసం ప్రజలను డబ్బులు అడగకుండా పని చేస్తానని, తప్పుడు లెక్కలు చూపకుండా నిజాయితీగా పని చేస్తానని ప్రమాణం చేసి, స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతనే పోటీ చేయాలని యువకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు బాండ్ పేపర్ పై సంతకం చేయాలని యువత కోరుతోంది. అక్రమ ఆస్తులు సంపాదించనని, ఐదేళ్ల తర్వాత ఆస్తులు పెరిగితే గ్రామానికి అప్పగిస్తామని జీపీ పనుల కోసం ప్రజల దగ్గర డబ్బులు అడగనని, తప్పుడు లెక్కలు చూపనని, గ్రామ అభివృద్ధికి సేవకుడిగా చేస్తానని రూ.100ల బాండ్ పేపర్ పై పోటీ చేసే అభ్యర్థులు మీడియా సమక్షంలో గ్రామ పెద్దలకు అప్పగించాలని కోరుతూ బాండ్ పేపర్ నమూనాను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ పోస్టును చూసిన పలువురు నంగునూరు గ్రామస్తులు ఈ బాండ్ పేపర్ కు కట్టుబడి ఉంటానని స్పందిస్తున్నారు.





