రిలయన్స్ మార్ట్ లో మున్సిపల్ అధికారుల తనిఖీలు
ఎక్స్‌పైరీ వస్తువులపై చర్యలు, రూ.30,000 ల భారీ జరిమానా
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

పట్టణంలోని ప్రముఖ సూపర్ మార్కెట్ రిలయన్స్ మార్ట్‌పై మున్సిపల్ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఇటీవలి కాలంలో ఒక దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని దృష్టిలో ఉంచుకుని, పురపాలక సంఘ కమిషనర్ టి. మల్లికార్జున్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టారు. ఇన్‌చార్జ్ మేనేజర్ సంపత్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీలలో రిలయన్స్ మార్ట్‌లో ఉన్న నిత్యవసర వస్తువులు, తినుబండారాలపై ముద్రించిన తేదీలను అధికారులు గమనించారు.
ఈ తనిఖీల్లో కొన్ని వస్తువులు ఎక్స్పైరీ డేట్ దాటి విక్రయించబడుతున్నట్లు గుర్తించారు. తినేందుకు అనువు కాని, ఆరోగ్యానికి హానికరమైన వస్తువులను అమ్మడం పై మున్సిపల్ అధికారులు తీవ్రంగా స్పందించారు. ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని వారించారు.
ఇంతకుముందు నన్నే శ్రీనివాస్ అనే కస్టమర్ కొనుగోలు చేసిన పన్నీరు (Paneer) లో ఫంగస్ (ఫంగస్ వ్యాధి) ఉన్న కారణంగా రిలయన్స్ మార్ట్‌కు రూ.30,000 జరిమానా విధించడమైంది.
ఈ తనిఖీల్లో సానిటరీ ఇన్స్పెక్టర్ బాల ఎల్లం, ఇన్‌చార్జ్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్, శంకర్, వార్డ్ ఆఫీసర్లు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అధికారులు తీసుకుంటున్న ఈ చర్యలను స్థానికులు అభినందించారు.