హోటళ్లు, బేకరీలపై కొరడా ఝళిపించిన మున్సిపల్ కమిషనర్
పరిశుభ్రత లేని ఆహార కేంద్రాలకు షాక్…. పలు బేకరీలు, రెస్టారెంట్లకు భారీ జరిమానాలు
కుళ్లిపోయిన ఆహారం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై కఠిన చర్యలు – 51,000 రూపాయల జరిమానా
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

అపరిశుభ్రత, నాణ్యత లేని వంటకాలు నిలువ ఉన్న ఆహార పదార్థాలు వినియోగించిన హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బేకరీలపై మున్సిపల్ అధికారులు సిబ్బంది కొరడా ఝళిపించారు. హుస్నాబాద్ పట్టణంలో కమిషనర్ టీ. మల్లికార్జున్ ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులు బేకరీలు, హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో కుళ్లిపోయిన ఆహార పదార్థాల వినియోగం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం, పరిశుభ్రత పాటించని పరిస్థితులు గుర్తించబడడంతో సంబంధిత యజమానులకు జరిమానాలు విధించారు.
ఈ సందర్భంగా కమిషనర్ టీ. మల్లికార్జున్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కోసం మున్సిపల్ శాఖ నిరంతరం ఇలాంటి తనిఖీలు చేస్తుందని, పరిశుభ్రతా ప్రమాణాలను అతిక్రమించే వారికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హోటళ్లు, బేకరీలు, ఆహార కేంద్రాల యజమానులు తప్పనిసరిగా పరిశుభ్రత పాటించి, నాణ్యమైన ఆహారం అందించాలని ఆయన సూచించారు. ఈ తనిఖీల్లో ఇన్స్పెక్టర్ బాల ఎల్లం, పర్యావరణ అధికారి రవికుమార్, బిల్ కలెక్టర్ సతీష్, జవాన్లు సారయ్య, ప్రభాకర్, అలాగే మున్సిపల్ సిబ్బంది శేఖర్, వనాకర్,సాగర్ పాల్గొన్నారు.





