రుణమాఫీ పథకం అమలు కాని రైతు సమస్యల పరిష్కారం పై వ్యవసాయ అధికారులతో ప్రత్యేక చర్యలు
రుణమాఫీ పై రైతులకు ఇబ్బందులు లేకుండా అధికారులు వ్యవహరించాలి.
రుణమాఫీ పై వ్యవసాయ శాఖ అధికారులకు పోన్ సంభాషణలో మంత్రి తుమ్మల దిశా నిర్దేశం
కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ అనుబంధ పథకాల పై రైతు వేదికల ద్వారా అవగాహన కల్పించాలి
బిసి మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ వ్యవసాయ అధికారులు ఏవో, ఏఈవో , హార్టికల్చరల్ ఆఫీసర్ల తో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గంలో రైతులకు రుణమాఫీ పథకం అమలు కానీ సమస్య పరిష్కారానికి అధికారులు పిర్యాదులు తీసుకోవాలన్నారు.
ప్రభుత్వం ఇప్పటికే మూడు దశల్లో లక్ష ,లక్షా 50 వేలు, 2 లక్షల వరకు రైతు రుణమాఫీ పూర్తి చేశామని తెలిపారు. ఒక హుస్నాబాద్ నియోజకవర్గంలోనే 34,886 మంది రైతులకు రూ 269.6 కోట్ల రూపాయలు విడుదలయ్యాయన్నారు. రుణమాఫీ పై రైతుల ఆందోళనలు నివృత్తి చేయాలని, వారి సమస్యల పరిష్కారానికి అవగాహన కల్పించాలనీ సూచించారు. రుణమాఫీ పూర్తి అయిన రైతులు లబ్దిదారులతో సానుకూల దృక్పథం వచ్చేలా సమావేశాలు ఏర్పాటు చేయాలని గతంలో దేశంలో ఎక్కడ లేని విధంగా ఇంత పెద్ద ఎత్తున రైతు రుణమాఫీ చేసిందనే విషయాన్ని ప్రజల్లో తెలియజేయాలని సూచించారు. రైతులు ఎలాంటి పిర్యాదులు తెచ్చిన వ్యవసాయ అధికారులు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు రుణమాఫీ విషయంలో బ్యాంక్ అధికారులతో ఇబ్బందులు తలెత్తితే అధికారులు సమన్వయం చేసుకొని రైతులకు సహాయకంగా ఉండాలని ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ రంగాల పథకాల పై ప్రతి రైతు వేదిక ఆధారంగా వ్యవసాయ, ఉద్యాన వన, సేరికల్చర్ అధికారులు సమన్వయం చేసుకొని రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ కు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన 209 జీవో ను ప్రజల్లోకి తీసుకెళ్లాలనీ కాలువల నిర్మాణం పూర్తి కావడానికి 431.50 కోట్లు విడుదల చేసిందనే అంశాన్ని గ్రామాల్లో రైతుల దృష్టికి తీసుకుపోవాలని తెలిపారు. వచ్చే సీజన్ లోపు గౌరవెల్లి ప్రాజెక్ట్ కాలువల ద్వారా నీళ్ళు అందిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
రుణమాఫీ కానీ రైతులు ముఖ్యమంగా 2018 డిసెంబర్ 12 కంటే ముందు తీసుకున్న వారు, 2023 డిసెంబర్ 9 తరువాత తీసుకున్న వారికి వర్తించదన్నారు. దీనిని గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. 2 లక్షల పైన రుణం ఉన్న వారే అధికంగా ఉన్నారని వారి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై త్వరలోనే నియమ నిబంధనలు రానున్నాయన్నారు. ప్రతి మహిళా మహిళా సంఘాల్లో భాగస్వామ్యం ఉండాలని కోరారు. త్వరలోనే వారితో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి గ్రామంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. మాది వ్యవసాయ కుటుంబం అని రైతులకు ఏ ఇబ్బందులూ ఉన్న తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. రేషన్ కార్డులు లేకుండా రుణమాఫీ కానీ వారి సమస్యలు అధికంగా వస్తున్నాయని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ అధికారులతో పోన్ సంభాషణ లో మాట్లాడారు. రుణమాఫీ కి సంబంధించి వస్తున్న సమస్యల పై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. రైతు రుణమాఫీ విషయంలో ఏదైనా సమస్య వస్తె ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు.
సమావేశం అనంతరం వ్యవసాయ అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ సత్కరించారు. ఈ సమావేశంలో సింగిల్ విండో చైర్మన్ బోలిషెట్టి శివయ్య , ఏవోలు, ఏఈవోలు, హార్టికల్చర్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.





