హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మిక పర్యటన
సిద్దిపేట్ టైమ్స్ హుస్నాబాద్, జూలై 26:

హుస్నాబాద్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన రాష్ట్ర శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డ్రైనేజీలు, రోడ్లు, ప్రభుత్వ పథకాల అమలును పరిశీలించారు. గోదంగడ్డ నుండి రెడ్డి కాలనీ వరకు ఉన్న రోడ్డును పరిశీలించిన మంత్రి, ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా ఇబ్బందులపై స్పందిస్తూ త్వరలోనే రోడ్డు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
పర్యటనలో భాగంగా, మంత్రి నాల్గవ వార్డులోని పాత రిజిస్ట్రేషన్ ఆఫీస్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న ములుగురి పద్మ ఇంటిని, రెండవ వార్డులో జాల రాజుకు చెందిన ఇండిరమ్మ ఇల్లు పనులను పరిశీలించారు. లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాల్లో ఆలస్యం కాకుండా, పనులు చేస్తున్నవారిగా బిల్లులు వెంటనే క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇసుక కొరత విషయాన్ని లబ్ధిదారులు మంత్రి దృష్టికి తీసుకురావడంతో, మంత్రి తక్షణమే అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం చేయాలని సూచించారు. రెవెన్యూ, పోలీస్ శాఖల సమన్వయంతో ఇసుక సరఫరా సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు.
ఇండిరమ్మ ఇళ్ల బేస్మెంట్ పనులు పూర్తయిన లబ్ధిదారులకు లక్ష రూపాయల వరకు ప్రభుత్వం నుండి విడుదల కాబోతున్న నిధులను త్వరితగతిన మంజూరు చేయాలని తెలిపారు. అలాగే మహిళా సంఘాల నుండి లబ్ధిదారులు రుణాలు పొందవచ్చని సూచించారు.
మంత్రి పర్యటనలో ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని, లబ్ధిదారులు వెంటనే నిర్మాణాలను ముగించాలని సూచిస్తూ మంత్రి గారు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.