హైదరాబాద్లో సస్టెనిబిలిటీ ఆన్ వీల్స్ ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్
యంత్రాల ద్వారా రీసైక్లింగ్ చేయడం ఈ వాహన ప్రధాన లక్ష్యం
హుస్నాబాద్ ఇన్నోవేషన్ పార్క్ & 18 స్టార్టప్స్ కలసి రూపొందించిన వినూత్న ప్రాజెక్ట్
హుస్నాబాద్ మున్సిపాలిటీకే తొలి రీసైక్లింగ్ వాహనం

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
హుస్నాబాద్ ఇన్నోవేషన్ పార్క్ ఆధ్వర్యంలో రూపొందించిన సస్టెనిబిలిటీ ఆన్ వీల్స్ మొబైల్ వెహికిల్ను మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం రోజు హైదరాబాద్లోని టి వర్క్ కేంద్రంలో ప్రారంభించారు. ఈ వినూత్న వాహనం 67 లక్షల రూపాయల వ్యయంతో 18 స్టార్టప్ కంపెనీలు కలసి నిర్మించాయి. ప్లాస్టిక్, పాలిథిన్, పేపర్లు, ఈ-వెస్ట్, మెటల్ వ్యర్థాలు, టెక్స్టైల్ వ్యర్థాలు, శానిటరీ ప్యాడ్స్, సిగరెట్ ముక్కలు వంటి అనేక వస్తువులను సేకరించి ప్రత్యేక యంత్రాల ద్వారా రీసైక్లింగ్ చేయడం ఈ వాహన ప్రధాన లక్ష్యం. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, “ప్లాస్టిక్ వినియోగం వల్ల క్యాన్సర్, గర్భసంబంధ వ్యాధులు వంటి అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. అందుకే రీసైక్లింగ్ అత్యవసరం. రాష్ట్రంలో తొలిసారిగా హుస్నాబాద్ మున్సిపాలిటీలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం గర్వకారణం” అని అన్నారు.
ఇప్పటికే 284 మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంక్లు పంపిణీ చేసినట్లు, 13 రకాల వస్తువులతో 500, 400, 300 కిట్లు అందజేసినట్లు తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గంలోని 300 టీ స్టాళ్లకు స్టీల్ గ్లాస్లు ఇచ్చామని, ప్రజల సహకారంతో ప్లాస్టిక్ రహిత సమాజంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలి. వర్షపు నీటిని కాపాడుకోవడానికి వాటర్ హార్వెస్టింగ్ తప్పనిసరి. భవనాల నిర్మాణంలో వాటర్ హార్వెస్టింగ్ పాయింట్లు ఏర్పాటు చేయడం కచ్చితమైన నిబంధనగా అమలు చేస్తాం. గోదావరి, కృష్ణ, సింగూరు, మంజీరా నుండి ప్రభుత్వం 547 MLD నీటిని అందిస్తున్నప్పటికీ వేసవికాలంలో ఇబ్బందులు వస్తున్నాయని, కాబట్టి గ్రౌండ్ వాటర్ కాపాడుకోవాలి అని మంత్రి పిలుపునిచ్చారు. “ప్లాస్టిక్ రహిత సమాజం – హరిత తెలంగాణ మా లక్ష్యం. ప్రజల సహకారంతోనే ఇది సాధ్యమవుతుంది” అని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.





