సెట్విన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్ నియోజకవర్గ మహిళలు, నిరుద్యోగ యువత ఉపయోగించుకోవాలి

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని మున్సిపల్ కాంప్లెక్స్ లో సెట్వీన్ సాంకేతిక శిక్షణ కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగామంత్రి మాట్లాడుతూ… సెట్విన్ సాంకేతిక శిక్షణ కేంద్రాల్లో నిర్వహిస్తున్న స్వయం ఉపాధి శిక్షణ తరగతులు నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తున్నాయని, నిరుద్యోగ, యువతీ, యువకులకు బ్యుటీషియన్, ఎంబ్రాయిడరీ, కంప్యూ టర్, మోటార్ రిపేర్, మొబైల్ రిపేర్, హౌస్‌వైరింగ్ కోర్సుల్లో శిక్షణ ఉంటుందని తెలిపారు. ఈ శిక్షణా కేంద్రాలను నియోజకవర్గ మహిళలు, నిరుద్యోగ యువత ఉపయోగించుకుని ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి పొంది వారి కాళ్ల మీద వారే నిలబడేలా తయారు కావాలన్నారు. ఇంట్లోనే కూర్చుని ఆదాయం పెంచుకోవడానికి వివిధ రకాల శిక్షణ ఇస్తారన్నారు. హైదరాబాద్ తర్వాత జహీరాబాద్ హుస్నాబాద్ ల లోనే ఈ కేంద్రాలు ఏర్పాటు చేశామని, త్వరలో రాష్ట్రమంతా ఏర్పాటు చేస్తామన్నారు.

అనంతరం సెట్విన్ సంస్థ చైర్మన్ ఎన్. గిరిధర్రెడ్డి మాట్లాడుతూ…యువత కు నైపుణ్యాన్ని పెంచడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. జంట నగరాలలోని కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సెట్విన్ సేవలను త్వరలో విస్తరించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. త్వరలో నల్గొండ, జడ్చర్ల, మహబూబ్నగర్లలో కొత్తగా శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 23 కేంద్రాలు ఉన్నాయని, అదనంగా ఐదు కేంద్రాలను త్వరలో ప్రారంభిస్తామన్నారు. అధునాతన సాంకేతిక శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పిస్తాంమని, స్థానిక యువత ఈ శిక్షణ కేంద్రాల్లో శిక్షణ తీసుకొని ఉపాధి పొందాలన్నారు. సంస్థ ద్వారా 60 కోర్సుల్లో యువతీ యువకులు శిక్షణ పొంది దేశ, విదేశాల్లో ఉపాధి పొందుతున్నట్లు చెప్పారు.






