పత్తి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్

పత్తి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్

పత్తి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణలో మొదటి పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

తెలంగాణలో ఈ సీజన్‌లో తొలి పత్తి కొనుగోలు కేంద్రాన్ని హుస్నాబాద్ నియోజకవర్గంలోని కొండాపూర్ సమీపంలోని గోమాత పత్తి మిల్లులో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం ప్రారంభించారు. అనంతరం హుస్నాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని కూడా లాంఛనంగా ప్రారంభించారు.

కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ముందుగా పత్తి తేమ శాతం పరిశీలించి రైతుల కష్టాన్ని ప్రశంసించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, “కాటన్ కార్పొరేషన్ 12 రాష్ట్రాల్లో ‘కపాస్ కిసాన్’ మొబైల్ యాప్ ద్వారా జిన్నింగ్ మిల్లుల వద్దే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఆ యాప్ ద్వారా రైతులకు తేది, స్లాట్ ఇస్తారు. ఈరోజు తెలంగాణలో మొదటి పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం గర్వకారణం” అన్నారు. “ఈసారి పత్తికి రూ.8,100 మద్దతు ధర నిర్ణయించాం. వర్షాల కారణంగా పత్తి నాణ్యతపై ప్రభావం పడినా రైతులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులు తమ పత్తిని నిరభ్యంతరంగా విక్రయించవచ్చు.” అలాగే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభించామన్నారు. “రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వరి, పత్తి, మొక్కజొన్న కొనుగోలు కొనసాగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మార్గదర్శకత్వంలో ప్రతి జిల్లాలో కలెక్టర్లకు తగిన ఆదేశాలు జారీ చేశాం” అని వివరించారు.

“సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నాం. వడ్లు విక్రయించిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమవుతున్నాయి. అక్కన్నపేటలో సన్‌ఫ్లవర్ విత్తనాల పంపిణీ జరిగింది. నర్మేటలో ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ట్రయల్ రన్ మొదలైంది. త్వరలో పూర్తి స్థాయిలో ప్రారంభమవుతుంది.” రైతులు లాభదాయకమైన పంటలను ఎంచుకుని అధిక దిగుబడి సాధించాలన్నారు. హార్టికల్చర్, సెరికల్చర్, ఆయిల్ ఫామ్ పంటలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తిచేసి పంటపొలాలకు నీరు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి, గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి, వైస్ చైర్మన్ బంక చందు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు రైతులు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *