ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్, సిబ్బందిపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ (ప్రత్యేక ప్రతినిధి):
హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు, సిబ్బందిపై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల ప్రకారం, అక్టోబర్ 7వ తేదీ మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో హుస్నాబాద్ పట్టణానికి చెందిన చిట్టంపల్లి సురేష్ అనే వ్యక్తి హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి, డ్యూటీలో ఉన్న వైద్యులు మరియు సిబ్బందిపై అసభ్య పదజాలంతో దూషణలు చేయడమే కాకుండా, వారి విధులకు ఆటంకం కలిగించాడు. అంతేకాకుండా, వైద్య సిబ్బంది ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అవమానకర వ్యాఖ్యలు చేసినట్లు ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు హుస్నాబాద్ ఎస్ఐ లక్ష్మారెడ్డి కేసు నమోదు చేసి, దర్యాప్తు జరిపి నిందితుడు చిట్టంపల్లి సురేష్‌ను అరెస్టు చేశారు. అనంతరం అతనిని న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్‌కు పంపించారు. ఈ సందర్భంగా ఎస్ఐ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, “ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులు నిర్వర్తించే సమయంలో వారికి ఆటంకం కలిగించడం, దాడులకు పాల్పడడం తీవ్రమైన నేరం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాము” అని హెచ్చరించారు.





