సోషియల్ వెల్ఫేర్ పాఠశాలలో విద్యార్థి మృతి ఘటనపై గ్రంథాలయ చైర్మన్ ఆకస్మిక తనిఖీ
వివేక్ మృతి ఘటన స్థలాన్ని పరిశీలించిన జిల్లా గ్రంథాలయ చైర్మన్… ఘటనపై సమగ్ర విచారణ జరుగుతుందని భరోసా

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెల్లగడ్డలోని సోషియల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఈనెల 7న అనుమానాస్పద పరిస్థితుల్లో విద్యార్థి వివేక్ మృతి చెందిన ఘటన స్థలాన్ని పరిశీలించి, పాఠశాల ప్రిన్సిపాల్ నుంచి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ పరిసరాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడిన ఆయన, మధ్యాహ్న భోజనం నాణ్యతను కూడా పరిశీలించారు. విద్యార్థి మృతి ఘటనపై పోలీసులు ఇప్పటికే దర్యాప్తు జరుపుతున్నారని, విచారణలో మృతికి గల నిజమైన కారణాలు వెలుగులోకి వస్తాయని లింగమూర్తి తెలిపారు.
ఈ ఘటనపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు పేర్కొంటూ, మృతిపై సమగ్ర విచారణ జరపాలని అధికారులు ఆదేశించినట్లు తెలిపారు. విద్యార్థి కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, అలాగే హాస్టల్లో అవసరమైన సదుపాయాలను తక్షణమే ఏర్పాటు చేయించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వెన్నె రాజు, అరే కిషోర్, రమేష్ నాయక్, మహేందర్, రాజు తదితరులు పాల్గొన్నారు.





