భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం – ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకుందాం.
నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా ప్రొఫెసర్ డా. హెచ్. వాగిషన్

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
“భారత రాజ్యాంగ దినోత్సవ” వేడుకలు బుధవారం హుస్నాబాద్ నియోజకవర్గ JAC ఆధ్వర్యంలో రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. జేఏసీ కోఆర్డినేటర్ మేకల వీరన్న యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి నల్సార్ లా యూనివర్సిటీ, హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెసర్ డా. హెచ్. వాగీషన్ ప్రధాన వక్తగా హాజరయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్ ద్వారా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, “ప్రతి భారత పౌరుడు రాజ్యాంగాన్ని అధ్యయనం చేసి, ఆచరణలో పెట్టాలి. ప్రజాస్వామ్య పరిరక్షణలో యువత ముందుండాలి” అని పిలుపునిచ్చారు. ప్రధాన వక్త డా. వాగీషన్ మాట్లాడుతూ,… “భారత రాజ్యాంగం ప్రపంచంలోని అత్యుత్తమ రాజ్యాంగాలలో ఒకటి అని, రాజ్యాంగ వ్యతిరేక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ప్రశ్నించే తత్వం కీలకం” అని స్పష్టం చేశారు.
ముఖ్యఅతిధి, సిద్ధిపేట జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి మాట్లాడుతూ.., “ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటిని ప్రతిఒక్కరూ గమనించాలి” అని హెచ్చరించారు. జేఏసీ కన్వీనర్ కవ్వ లక్ష్మా రెడ్డి యువత రాజ్యాంగ అవగాహన పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకతను చెప్పారు. డ్రగ్స్, ఆన్లైన్ గేమ్స్ పట్ల జాగ్రత్త అవసరం అని సూచించారు. సదస్సు అనంతరం రాజ్యాంగంపై వ్యాస రచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. హుస్నాబాద్ మండలం నుండి మొదటి బహుమతి Md. అయేషా బీ, రెండవ బహుమతి బి. ప్రశాంత్ దక్కాయి. ఇతర మండలాల నుండి సాయిశ్రి, ప్రదీప్ కుమార్, లక్ష్మీ ప్రసన్న, చందన తదితరులు విజేతలుగా నిలిచారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, హుస్నాబాద్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు చిత్తారి రవీందర్, బీఎస్పీ నాయకులు ఎనగందుల శంకర్, అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి చెప్యాల ప్రకాశ్, వివిధ ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. “రాజ్యాంగాన్ని కాపాడటం ప్రతి పౌరుని ధర్మం” అనే నినాదాలతో సదస్సు ముగిసింది.





