ఖబర్దార్ కాంగ్రెస్.. ఉద్యోగాలు ఇస్తారా ..గద్దె దిగుతారా..
గ్రూప్-1లో 1600, గ్రూప్-2లో 2000, గ్రూప్-3లో 3000, డీఎస్సీలో 25 వేలు పోస్టులు పెంచాలి
హామీలు అమలుచేసేదాకా వదిలిపెట్టం
నిరుద్యోగులు, విద్యార్థులతో పెట్టుకున్న ప్రభుత్వాలు నిలబడినట్టు చరిత్రలో లేదు
1:100 నిష్పత్తిలో గ్రూప్-1 మెయిన్ పరీక్షలకు అభ్యర్థులను ఎంపిక చేయాలి
మహాధర్నాలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించిన నిరుద్యోగులు
నినాదాలతో దద్దరిల్లిన ధర్నా చౌక్
మహాధర్నాకు బీఆర్‌ఎస్ పూర్తి మద్దతు
సిద్దిపేట టైమ్స్ డెస్క్:
‘ఖబర్దార్ కాంగ్రెస్.. ఉద్యోగాలు ఇస్తారా? గద్దె దిగుతారా? గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలుచేసే దాకా వదిలి పెట్టే ప్రసక్తే లేదు.. నిరుద్యోగులు, విద్యార్థులతో పెట్టుకున్న ప్రభుత్వాలు నిలబడినట్టు చరిత్రలో లేదు. మా ఉద్యమాలు హైదరాబాద్‌లోనే కాదు.. గ్రామాల్లో గడపగడపకు చేరేలా చేస్తాం..’ అని నిరుద్యోగులు, విద్యార్థులు హెచ్చరించారు.
నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించడాన్ని నిరసిస్తూ 5,000 మందికిపైగా నిరుద్యోగులు హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ధ గురువారం మహాధర్నా నిర్వహించారు. హామీలను నెరవేర్చకపోతే రాష్ట్రంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రేవంత్ సర్కారును హెచ్చరించారు. గ్రూప్-1లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 1,600 పోస్టులు పెంచాలని, గ్రూప్-2లో 2,000, గ్రూప్- 3లో 3,000, డీఎస్సీలో 25,000 వరకు టీచర్ పోస్టులు పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. గ్రూప్-1 మెయిన్ కోసం 1:100 నిష్పత్తి ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేయాలని, పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన జీవో 46 రద్దు చేయాలని, గురుకులాల రిక్రూట్‌మెంట్‌లో మిగిలిన టీజీటీ, పీజీటీ పోస్టులను వెయిటింగ్ జాబితాలో ఉన్న వారికి ఇవ్వాలని కోరారు.
జాబ్ క్యాలెండర్ ఊసెత్తని కాంగ్రెస్ సర్కారు
ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, అధికారం చేపట్టి ఆరు నెలలైనా జాబ్ క్యాలెండర్ ఎక్కడా? అని నిరుద్యోగులు నిలదీశారు. హామీ ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి తీరాల్సిందే డిమాండ్ చేశారు. కాంగ్రెస్ తరఫున ఎన్నికల ముందు బల్మూరి వెంకట్, చింతపండు నవీన్, హర్షవర్ధన్‌రెడ్డి నిరుద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చి, తమను మభ్యపెట్టారని విమర్శించారు. ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా ప్రభుత్వం నిరుద్యోగులను మోసగిస్తున్నదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పైగా మాజీ సీఎం కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించిన 30 వేల పోస్టులకు పోస్టింగ్ ఆర్డర్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నట్టు దుయ్యబట్టారు. నిరుద్యోగుల మహాధర్నాకు బీఆర్‌ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. మహాధర్నాలో బీఆర్‌ఎస్ నేతలు ఎర్రోళ్ల శ్రీనివాస్, గెల్లు శ్రీనివాస్, తుంగబాలు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, బక్క జడ్సన్, నిరుద్యోగుల తరఫున ప్రతినిధులు పాల్గొన్నారు.
రేవు దాటినంక బోడ మల్లన్న తీరుగా..
నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లను రేవంత్ సర్కారు నెరవేర్చలేకపోతున్నది. రేవు దాడేదాక ఓడ మల్లన్న.. రేవు దాటినంక బోడ మల్లన్న.. అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులతో వ్యవరిస్తున్నది. గ్రూప్-2, గ్రూప్-3లో నోటిఫికేషన్‌లో పోస్టులు పెంచకుండా, మెగా డీఎస్సీ ప్రకటించకుండా చెలగాటమాడుతున్నది. ఎప్పటికైనా తెలంగాణ నిరుద్యోగులకు అండగా ఉండేది బీఆర్‌ఎస్ పార్టీనే. ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుద్యోగులకు అన్యాయం జరుగకుండా చూసుకుంటాం. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు న్యాయం చేయకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదురోవాల్సి వస్తుంది.
-తుంగ బాలు, బీఆర్‌ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
పోరాటాలతోనే ఉద్యోగాలు సాధ్యం
పోరాటాలు, ఉద్యమాలతోనే ఉద్యోగాలు సాధ్యమవుతాయి. కొత్తగా ఏర్పడిన 23 జిల్లాల వల్ల రాష్ట్రంలో పోస్టుల సంఖ్య పెరిగింది. దాని ప్రకారం గ్రూప్-1లో 1,600, గ్రూప్ 2లో 2,000, గ్రూప్ 3లో 3,000తోపాటు డీఎస్సీ నోటిఫికేషన్‌లో 25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలి. గ్రూప్-4లో 8,500 పోస్టులే ప్రకటించారు. కానీ, 25 వేలకుపైగా ఖాళీలు ఉన్నాయి. గత ఎన్నికల ముందు కాంగ్రెస్ తరఫున మల్లు భట్టివిక్రమార్క అసెంబ్లీలో మాట్లాడుతూ.. గూప్-1 మెయిన్స్ 1:100 అభ్యర్థులు పిలువాలని ఆనాడు డిమాండ్ చేశారు. కానీ, ఇప్పుడు ఆ ఊసేత్తడం లేదు. నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందే. లేదంటే ఉద్యమాలు చేస్తాం.
– ఆర్ కృష్ణయ్య, ఎంపీ, జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు
నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దు
విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న ప్రభుత్వాలు బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు గట్టి గుణపాఠం చెప్తారు. ఇచ్చిన హామీలు అమలుచేసి తీరాల్సిందే. గ్రూప్ 1 మెయిన్ పరీక్షలకు 1:50 కాకుండా 1:100 చొప్పున అభ్యర్థులను పిలవాలి. గ్రూప్-2, గ్రూప్-3లో అదనపు పోస్టులు కలుపుతామన్న మాటను నిలబెట్టుకోవాలి. పరీక్షకు పరీక్షకు మధ్య కనీసం 2 నెలల గ్యాప్ ఉండాలి. డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా 25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలి. ఇచ్చిన హామీలు అమలయ్యేదాకా విద్యార్థుల తరఫున బీఆర్‌ఎస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటది.
-ఎర్రోళ్ల శ్రీనివాస్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్
‘నిరుద్యోగులను’ రోడ్ల మీదకీడ్చిన కాంగ్రెస్
తప్పుడు హామీలు, అబద్ధపు ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి మోసం చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను రోడ్లమీదకు ఈడ్చింది. అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైంది. అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. విద్యార్థుల తరఫున గొంతెత్తి పోరాటం చేస్తాం. విద్యార్థులు, నిరుద్యోగుల తరఫున పోరాటం చేసేందుకు బీఆర్‌ఎస్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది.
– గెల్లు శ్రీనివాస్, బీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు