జలదిగ్బంధంలో హుస్నాబాద్ పట్టణం..
జలమయమైన పలు కాలనీలు, రోడ్లు, బస్టాండ్ పరిసర ప్రాంతాలు
భారీ వర్షంతో నీట మునిగిన మెయిన్ రోడ్డు దుకాణ సముదాయాలు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్, అక్టోబర్ 29:


“మొంథా” తుఫాను ప్రభావంతో హుస్నాబాద్ లో ఉదయం నుండి కురుస్తున్న కుండపోత వర్షంతో హుస్నాబాద్ పట్టణం జలదిగ్బంధమైంది. పట్టణంలో రికార్డు స్థాయిలో 20cm వర్షపాతం నమోదైంది. గంటల తరబడి కురిసిన ఈ వర్షం కారణంగా పట్టణంలోని ప్రధాన రహదారులు నీటమునిగిపోయాయి. ప్రత్యేకంగా బస్టాండ్, మెయిన్ రోడ్, హనుమకొండ రోడ్ పరిసర ప్రాంతాలు పూర్తిగా మోకాళ్ళ లోతు నీటితో మునిగిపోయి రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ప్రధాన రహదారులపై నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అనేక దుకాణాల్లోకి వర్షపు నీరు చేరి వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు.
పట్టణంలోని తక్కువ ఎత్తున్న ప్రాంతాలు చిన్న చెరువుల్లా మారిపోయి ప్రజలు ఇళ్లలోనే చిక్కుకుపోయారు. మున్సిపల్ అధికారులు నీటి ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం ఇంకా కొన్ని గంటలపాటు వర్షం కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.






