“మొంథా” తుఫాను ప్రభావం – రైతులు అప్రమత్తంగా ఉండాలి
వర్షాల కారణంగా రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు
రాష్ట్ర రవాణా మరియు బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట టైమ్స్ వెబ్ డెస్క్;
మొంథా” తుఫాను ప్రభావంతో జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. వర్షాల కారణంగా రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంత్రి ప్రభాకర్ మాట్లాడుతూ, వ్యవసాయ, మార్కెటింగ్, రెవిన్యూ, డీఆర్డీఓ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి రైతులకు తగిన సహాయాన్ని అందించాలన్నారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలకు తరలించిన వరి ధాన్యం నిల్వలు మరియు పంట ఆరబెట్టే ప్రదేశాల్లోని ధాన్యం వర్షానికి తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. తుఫాన్ ప్రభావం గురించి రైతులకు ముందస్తుగా సమాచారం అందజేస్తూ అప్రమత్తం చేయాలని ఆయన సూచించారు. వర్షాలు, గాలుల తీవ్రత తగ్గే వరకు వరి కోతలు నిలిపివేయాలని రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని తెలిపారు.
అలాగే, కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు ధాన్యం తరలింపు వేగవంతం చేయాలని, దిగుమతి ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ట్రక్ షీట్లు సకాలంలో తెప్పించి ట్యాబ్ ఎంట్రీలు సమయానికి పూర్తి చేయాలని సూచించారు. తడిసిన ధాన్యం పాడవకుండా ఉండేందుకు వ్యవసాయ అధికారులు సూచించే పద్ధతులు పాటించాలని రైతులకు మంత్రి పిలుపునిచ్చారు. తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గే వరకు ప్రతి రైతు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వం రైతులతో పాటు ఉందని మంత్రి స్పష్టం చేశారు.





