ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఇసుక అక్రమ రవాణా..
అనుమతి లేకుండా తరలింపు..
వాహనాలకు నంబర్ లేకుండా రవాణా..
పట్టించుకోని సంబంధిత అధికారులు..
సిద్ధిపేట టైమ్స్,మద్దూరు(సెప్టెంబర్, 20):
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేరుతో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతుంది.అభివృద్ధి పనుల పేరిట అక్రమంగా ఇసుకను తరలిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు.రాత్రి, పగలు తేడాలేకుండా ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నా సంబంధిత అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.శనివారం నంగూనూర్ మండలం ఖాతా గ్రామం నుండి ధూళిమిట్ట మండలం బెక్కల్,తోర్నాల,బైరాన్ పల్లి మద్దూరు మండలంలోని వల్లంపట్ల,రేబర్తి,గాగిళ్ళపూర్, నర్సాయపల్లి గ్రామాలకు కొంతమంది ట్రాక్టర్ యజమానులు ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అనుమతులు లేకుండా పట్ట పగలే ఇసుక అక్రమ రవాణా చేస్తున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు.ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇసుక కోసం ఇబ్బందులు పడుతుంటే ఇసుకాసురులు అనుమతుల పేరిట అడ్డూ అదుపులేకుండా అక్రమంగా రవాణా చేస్తున్నారు.ఇలా మిట్ట మధ్యాహ్నం ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా మైనింగ్, రెవెన్యూ, పోలీసు అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పట్టపగలే అతివేగంతో ట్రాక్టర్ లు రోడ్లపై ప్రయాణిస్తుంటే ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.ఇటీవల గాగిళ్ళపూర్ గ్రామంలో ఒక మైనర్ బాలుడు ఇసుక అక్రమ రవాణా చేస్తుంటే రెవెన్యూ పోలీసులు అధికారులు పట్టుకొనీ చేతులు దులుపుకున్నారు.ట్రాక్టర్ లకు మరియు వాటి ట్రాలీలకు గాని నంబర్ లు లేకుండా కొంత మంది మైనర్ బాలురు ఇసుక రవాణా చేస్తున్న వారిపై పోలీసు అధికారుల చర్యలు మాత్రం శూన్యమయ్యాయి.ఇసుక దందాకు అధికారులు సహకరిస్తున్నారని ప్రజలు బాహటంగానే చర్చించుకుంటున్నారు.మండలం అధికారులపై నమ్మకం లేదని,జిల్లా అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఇసుక అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.





