హుస్నాబాద్ ను ఆకుపచ్చని పట్టణంగా తయారు చేసుకోవాలి
హుస్నాబాద్ పురపాలక సంఘ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో 7,8,10 వార్డులలో ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమం పురపాలక సంఘ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పురపాలక సంఘ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న హాజరై వార్డు కౌన్సిలర్లతో కలిసి ఇంటింటికి పూల మరియు పండ్ల మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ వృక్షో రక్షతి రక్షితః, అంటే చెట్లను మనం రక్షించుకుంటే అవి మనల్ని కాపాడుతాయని, మొక్కలు పర్యావరణానికి మేలు చేస్తాయని, ఇవి భూమి యొక్క ఉష్ణోగ్రతను తగ్గించడంలో, తేమను నిర్వహించడంలో మరియు ఇతర జంతువుల మనుగడకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడంలో సహాయపడతాయని, మన సంస్కృతి ప్రకృతితో మమేకమైందని, మొక్కలు నాటి వాటిని సంరక్షించుకుంటే కొన్ని రోజుల తర్వాత అవి నీడనిస్తాయని, చెట్లు కార్బన్ డైయాక్సైడ్ తీసుకొని మనకు ఆక్సిజన్ ఇస్తాయని, చెట్లు లేకపోతే ఆక్సిజన్ శాతం తగ్గుతుందని, దానివల్ల ఆక్సిజన్ ను కూడా కొనుక్కునే పరిస్థితి వస్తుందని, అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ఒక మొక్కను పెంచుకొని కాపాడుకోవాలని, హుస్నాబాద్ పట్టణాన్ని పచ్చని పట్టణంగా తయారు చేసుకోవాలని తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ అనిత రెడ్డి, కౌన్సిలర్లు మ్యాదరబోయిన వేణు, చిత్తారి పద్మ, గోవిందురవి, సానిటరీ ఇన్స్పెక్టర్ బాల ఎల్లం, వన మహోత్సవ సూపర్వైజర్ శంకర్, పర్యావరణ అధికారి రవికుమార్, వార్డ్ ఆఫీసర్స్ సత్తార్, సృజన్, కళ్యాణి, వార్డ్ ఆర్ పి లు స్వరూప, పద్మ జవాన్ ప్రభాకర్ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.