డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే ₹10,000 ఫైన్ లేదా ఆరు నెలల జైలు శిక్ష
రెండవసారి పట్టుబడితే ₹15,000 జరిమానా… చెల్లించని వారికి జైలు శిక్ష
మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు : హుస్నాబాద్ ఏసీపీ సదానందం హెచ్చరిక
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్, అక్టోబర్ 28 (మంగళవారం):
హుస్నాబాద్ ఏసీపీ యస్. సదానందం మద్యం సేవించి వాహనాలు నడిపే డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వారికి ₹10,000 జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష, అలాగే ఆరు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేయడం జరుగుతుందని తెలిపారు. రెండవసారి మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన వారికి ₹15,000 జరిమానా విధించబడుతుందని, జరిమానా చెల్లించని వారికి జైలు శిక్ష తప్పదని స్పష్టం చేశారు. “ఇందులో ఎలాంటి మినహాయింపు ఉండదు” అని ఆయన స్పష్టంగా చెప్పారు. ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఏసీపీ సదానందం మాట్లాడుతూ, ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, మైనర్లు వాహనాలు నడపకూడదని, తల్లిదండ్రులు వారికి వాహనాలు ఇవ్వకూడదని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం, సైలెన్సర్ మార్చి హోరాహోరీగా నడపడం వంటి వాటిపై కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు. “ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి. వ్యక్తిగత భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలి” అని ఏసీపీ సూచించారు. ట్రాఫిక్ భద్రతను పరిరక్షించడమే లక్ష్యంగా హుస్నాబాద్ పోలీస్ విభాగం మరింత కఠినంగా చర్యలు చేపట్టనున్నట్లు ఏసీపీ సదానందం స్పష్టం చేశారు.





