జలదిగ్బంధంలో హుస్నాబాద్
నీట మునిగిన ప్రధాన రోడ్లు, లోతట్టు ప్రాంతాలు
పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:


హుస్నాబాద్ పట్టణంలో ఆదివారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షంతో పట్టణం అతలాకుతలం అయింది. ప్రధాన రహదారి వెంబడి వర్షానికి మోకాళ్ళ లోతుతో నీరు నిలిచి పోవటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బస్వాపూర్ మోయ తుమ్మెద వాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో వరంగల్, సిద్దిపేట, హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సులను దారి మళ్లించారు. కనివిని ఎరుగని రీతిలో వరుణ బీభత్సం తో పట్టణ లోని మెయిన్ రోడ్డు, పోలీస్ స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్, నాగారం రోడ్డు, లోతట్టు ప్రాంతాల గృహాలలోకి వరద నీరు చేరింది. ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి, ఎక్కడ మురికి కాలువలు ఉన్నాయో, ఎక్కడ రోడ్లపై గుంతలు ఉన్నాయో తెలియని పరిస్థితులు ఉన్నాయి. శిథిలావస్థలో ఉన్న ఇల్లు కూలిపోతాయేమోనని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళితే పట్టణ కేంద్రంలోని నెహ్రూ రోడ్డు, సాయి నగర్, హనుమాన్ నగర్ కాలనీలో పలు ఇల్లు పూర్తిగా జలదిగ్బంధమై నిత్యావసర వస్తువులు పూర్తిగా తడిసిపోయాయి. నాగారం రోడ్డులో గల పలు షాపులలోకి వరద నీరు చేరి లక్షల్లో నష్టం వాటిల్లింది. చేసేది ఏమీ లేక గృహాలలో ఉన్నటువంటి వారంతా రోడ్డుపైకి వచ్చి నిలబడే పరిస్థితి దాపురించింది. ఎన్నడూ లేని విధంగా కురిసిన భారీ వర్షం వల్ల పట్టణంలోని పలు కాలనీలు పూర్తిగా జలదిగ్బంధమై నీటితో నిండిపోయాయి. వెంటనే నిర్మాణంలో ఉన్న ప్రధాన రహదారి వెంబడి ఉన్న మురికి కాలువలు మరియు డ్రైనేజీ వ్యవస్థకు మరమ్మత్తులు చేపట్టి ఇండ్లలోకి వరదనీరు రాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు, ప్రభుత్వ అధికారులు పరిస్థితిని అర్థం చేసుకొని సహాయ సహకారాలు అందించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.


మున్సిపల్ శాఖ ప్రత్యేక హెల్ప్ లైన్
నిరంతరాయంగా కురుస్తున్న వర్షానికి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేశారు. ప్రజలకు ఏమైనా ఇబ్బందులు తలెత్తినట్లు అయితే 7337347610 కాల్ సెంటర్ కు ఫోన్ చేయాలని తెలిపారు. అకాల వర్షాలకు జలమయమైన ప్రాంతాల ను పరిశీలించి శిథిలమైన గృహాలలో నివాసం ఉంటున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు
హుస్నాబాద్ డివిజన్ పరిధిలో ఎక్కడైనా వాగులు వంకల దాటికి ప్రమాదాలు జరిగినట్లయితే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ కు లేదా డయల్ 100 కు సమాచారం అందించాలని ఏసీపి సతీష్ కుమార్ తెలిపారు. రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ఇండ్లలో నుంచి బయటికి రావద్దని సూచించారు.








