రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు హుస్నాబాద్ విద్యార్థిని ఎంపిక
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్, అక్టోబర్ 17:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు చెందిన కె. సింధు ప్రియ TGSWRS జూనియర్ కాలేజీ (గర్ల్స్), బెజ్జంకి పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికై పాఠశాలకు గౌరవం తెచ్చిపెట్టింది. ఇటీవల అక్టోబర్ నెలలో సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ (గజ్వేల్ మండలంలో) జరిగిన 69వ ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి 17 సంవత్సరాల వయోపరిమితి వాలీబాల్ పోటీలలో, సింధు ప్రియ అత్యుత్తమ ప్రదర్శన కనబరచింది. ఆమె ప్రతిభతో సిద్దిపేట జిల్లా జట్టు గోల్డ్ మెడల్ సాధించింది.
ఈ సందర్భంగా పాఠశాల పి.డి. ఎస్. షకీల్ మరియు పి.ఇ.టి. ఏ. శ్రీలత మాట్లాడుతూ, సింధు ప్రియ కృషి, క్రమశిక్షణ మరియు ఆటపై అంకితభావమే విజయానికి కారణమని తెలిపారు. ఈ నెల 18 నుండి 20 అక్టోబర్ వరకు మహబూబ్‌నగర్ జిల్లా తిమ్మాపూర్ ZPHS గ్రౌండ్స్‌లో జరగనున్న 69వ రాష్ట్రస్థాయి పాఠశాలల వాలీబాల్ పోటీలకు ఆమె ఎంపికైందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి, హుస్నాబాద్ ఎంఈఓ బండారి మనీశ్, ప్రధానోపాధ్యాయులు వై. విజయ, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు సింధు ప్రియకు అభినందనలు తెలిపారు. వారు ఆమె రాష్ట్రస్థాయిలో కూడా ప్రతిభ కనబరచి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.





