మానవత్వం చాటుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్
గాయపడిన వారిని ప్రత్యేక వాహనంలో ఆస్పత్రికి తరలింపు
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిపై మంత్రి పొన్నం ప్రభాకర్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఔదార్యం
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

ఆపదలో ఉన్న వారు సమాచారం ఇవ్వగానే స్పందించే మంత్రి పొన్నం ప్రభాకర్..మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. తాజాగా జరిగిన ఘటనలో రోడ్డు ప్రమాదానికి గురై సాయం కోసం ఎదురు చూస్తున్న వారికి బాసటగా నిలిచారు.
మంత్రి పొన్నం ప్రభాకర్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లు హనుమకొండ పర్యటన ముగించుకొని హుజురాబాద్ వెళ్తుండగా మార్గ మధ్యలో ఎల్కతుర్తి మండలం కోతుల నడుమ వద్ద ద్విచక్ర వాహనం నుండి కింద పడిన వారి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ ఔదార్యం చూపించారు.
రోడ్డు ప్రమాదం లో గాయపడిన వారిని చూసి వెంటనే కాన్వాయ్ వాహనాలను ఆపి ప్రమాద బాధితులకు సిబ్బంది చేత త్రాగునీరు ఇప్పించి వెంటనే ప్రత్యేక వాహనం లో హాస్పిటల్ కి తరలించారు. బాధితులకు మంత్రి పొన్నం ప్రభాకర్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అండగా నిలిచారు. వెంటనే అధికారులతో మాట్లాడి గాయపడిన వారికి మంచి చికిత్స అందించాలని ఆదేశించారు. గాయపడిన వారిని త్వరితగతిన హాస్పిటల్ కి తరలించడానికి వెళ్ళే వాహనం వెంట పోలీసులను పంపించి దగ్గరుండి చికిత్స అందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.
