సురభి మెడికల్ కాలేజ్ పై హెచ్ ఆర్ సి ఆగ్రహం..
చైర్మన్, ప్రిన్సిపల్‌పై బెయిలబుల్ వారెంట్ జారీకి ఆదేశాలు..
సిద్దిపేట టైమ్స్, సిద్ధిపేట ప్రతినిధి, అక్టోబర్ 7:

సురభి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ యాజమాన్యం ప్రవర్తనపై హ్యూమన్ రైట్స్ కమిషన్ ( హెచ్ఆర్సీ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. విద్యార్థి కార్తీక్‌కు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వాలన్న హెచ్ఆర్సీ ఉత్తర్వులను కాలేజ్ పట్టించుకోకపోవడంపై కమిషన్ ఛైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ అంశంలో కాలేజ్ చైర్మన్, ప్రిన్సిపల్‌లు కమిషన్ సమన్లకు హాజరుకాకపోవడంతో, వారిద్దరిపై బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని ఛైర్మన్ ఆదేశించారు.
వివరాల్లోకి వెళ్తే.. కార్తీక్ అనే విద్యార్థి తన ఒరిజినల్ స్టడీ సర్టిఫికెట్లు కాలేజ్ ఇవ్వకపోవడంతో, పీజీ ప్రవేశానికి అవసరమైన డాక్యుమెంట్లు గడువులోపు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయలేకపోయాడు. ఈ విషయాన్ని బాధిత విద్యార్థి హెచ్ ఆర్ సి దృష్టికి తీసుకెళ్లాడు.
దీంతో 2023లోనే కాలేజ్ యాజమాన్యానికి సర్టిఫికెట్లు తిరిగి ఇవ్వాలని కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటివరకు వాటిని పాటించని కాలేజ్ యాజమాన్యం, హెచ్ఆర్సి సమన్లకూ స్పందించకపోవడం గమనార్హం.
ఇదే క్రమంలో, కాలేజ్ యాజమాన్యం విద్యార్థులపై ఒత్తిడి తేవద్దని, ఒరిజినల్ సర్టిఫికెట్లను రెండు వారాలపాటు అట్టిమాపుదలతో ఉంచవద్దని హెచ్చరించిన హెచ్ఆర్సీ, దీనిపై కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీకి ప్రత్యేకంగా సిఫార్సులు పంపింది.
విద్యార్థుల హక్కులు కాపాడటమే తమ ధ్యేయమని, వ్యవహారాన్ని తేలికగా తీసుకుంటే ఉపేక్షించబోమని హెచ్ ఆర్ సి హెచ్చరించింది.





