కాకతీయ హైస్కూల్‌పై హైకోర్టు సీరియస్..
షోకాజ్ నోటీసులు జారీ..
సిద్దిపేట టైమ్స్, హైదరాబాద్/సిద్ధిపేట: సెప్టెంబర్ 19
సిద్ధిపేట జిల్లాలో విద్యా వ్యవస్థలో పెద్ద ఎత్తున జరుగుతున్న అక్రమాలను వెలుగులోకి తీసుకొస్తూ, తెలంగాణ హైకోర్టులో ఓ కీలక కేసు దాఖలైంది. సిద్ధిపేటకు చెందిన కడతల అరవింద్ రెడ్డి అనే న్యాయ విద్యార్థి, తన తరుపు న్యాయవాది పల్లె వినోద్ కుమార్ రెడ్డితో తెలంగాణ హైకోర్టులో కేసు దాఖలు చేశారు. కాకతీయ హైస్కూల్ ఇంగ్లీష్ మీడియం సిద్ధిపేట, ను తప్పుడు పేరుతో కాకతీయ టెక్నో హైస్కూల్ గా కొనసాగిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులను మోసం చేస్తోందని హైకోర్టును ఆశ్రయించారు.
తప్పుడు పేరుతో స్కూల్.. ఆర్టిఐ తో ఆధారాలు బహిర్గతం..
పిటీషనర్ తన పిటిషన్‌లో ముఖ్యమైన ఆధారాలు న్యాయస్థానానికి సమర్పించారు. సిద్దిపేట డీఈఓ కార్యాలయం ఇచ్చిన ఆర్.టి.ఐ సమాచారం ప్రకారం, ఆ పాఠశాలకు అధికారికంగా నమోదు అయిన పేరు కాకతీయ హైస్కూల్ ఇంగ్లీష్ మీడియం సిద్దిపేట మాత్రమే. కానీ టెక్నో అనే పేరుతో నడిపేందుకు ఇలాంటి గుర్తింపు లేదని స్పష్టంగా తెలిపారు. సీబీస్ఈ అనుబంధం లేదని, ఐఐటి, జేఈఈ, నీట్ మెడికల్ ఒలింపియాడ్ వంటి కోచింగ్‌లు నడపడానికి అనుమతులు లేవని తేల్చిచెప్పారు. అయితే, ఈ వాస్తవాలను లెక్కచేయకుండా పాఠశాల నిర్వహణ, బహిరంగంగా “కాకతీయ టెక్నో హైస్కూల్” పేరుతో బోర్డులు వేసి, ప్రకటనలు ఇస్తూ, తల్లిదండ్రులను తప్పుదారి పట్టిస్తున్నదని పిటీషనర్ ఆరోపించారు.
ప్రభుత్వ ఉత్తర్వులను విస్మరించిన పాఠశాల..
పిటిషన్‌లో ముఖ్యంగా రెండు ప్రభుత్వ ఉత్తర్వులను ప్రస్తావించారు. G.O.Ms.No.91 (2009): “Techno, IIT, Olympiad, International” వంటి పదాలను ఉపయోగించి పాఠశాల పేర్లు పెట్టరాదని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. Rc.No.SPL/AD(Ele)/2016 (2016): తప్పుడు, తప్పుదోవ పట్టించే పేర్లు వాడరాదని అన్ని పాఠశాలలకు సూచించింది. ఈ స్పష్టమైన ఆదేశాలను విస్మరించి పాఠశాల నడుస్తుండటమే కాకుండా, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటోందని పిటీషనర్ వాదించారు.
హైకోర్టు జోక్యం – షోకాజ్ నోటీసులు..
ఈ కేసును పరిశీలించిన తెలంగాణ హైకోర్టు, విద్య విధానం, ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని వెంటనే స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రిన్సిపల్ సెక్రటరీ, విద్యాశాఖ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సిద్ధిపేట జిల్లా కలెక్టర్, డీఈఓ, కాకతీయ హైస్కూల్ నిర్వాహకులు అందరికీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ అక్రమాలకు సంబంధించి తక్షణ సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
బుధవారం విచారణ..
ఈ కేసును రాబోయే బుధవారం వాదనలకు పెట్టామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ విచారణలో ప్రభుత్వం, అధికారులు సమాధానమివ్వాల్సి ఉంటుంది.
ప్రజలలో చర్చ..
ఈ పరిణామం స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ప్రైవేట్ పాఠశాలలు “టెక్నో”, “ఐఐటీ”, “నీఈటీ”, “ఇంటర్నేషనల్” పేర్లతో నడిపి, తల్లిదండ్రులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ అనుమతులు లేకుండా ఈ విధంగా నడపడం చట్ట విరుద్ధమని హైకోర్టు నోటీసులు ఇవ్వడంతో ఇతర పాఠశాలలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.





