అయ్యా బాబోయి పులి..
పులి సంచారంతో ప్రజల్లో ఆందోళన..
సిద్దిపేట టైమ్స్, చిన్నకోడూరు,
అయ్యా బాబోయి పులి.. అంటూ ప్రజలు జంకుతున్నారు.. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం విఠలాపూర్ గ్రామానికి చెందిన రైతులు తమ వ్యవసాయ పొలం వద్దకు వెళ్లగా పులి అడుగులు కనబడడంతో భయందోళనకు గురవుతున్నారు.
ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి ఫారెస్ట్ అధికారులు సిబ్బందితో చేరుకొని అడుగులను పరిశీలించి, పెద్ద పులి సంచరిస్తుందని నిర్ధారించారు. సమాచారం అందుకున్న సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, స్థానిక చిన్నకోడూరు ఎస్ఐ చంద్రమోహన్ తో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి, పరిస్థితిని సమీక్షించారు. పులి సంచారం నేపథ్యంలో మాచపూర్, విఠలాపూర్, రంగయపల్లి మరియు ఎల్లాయపల్లి గ్రామాల ప్రజలు, ముఖ్యంగా రైతులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని రైతులు ఒంటరిగా బయట తిరగకూడదని ఏసీపీ విజ్ఞప్తి చేశారు. ఏసిపి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ రైతులు వ్యవసాయ పొలాల వద్దకు రాత్రి సమయంలో వెళ్లరాదన్నారు. పశువులను జాగ్రత్తగా కాపాడుకోవాలన్నారు. పులి సంచారిస్తుందన్న అనుమానం వస్తే దానిని పట్టుకునే ప్రయత్నం చేయక రైతులు ఫారెస్ట్ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించాలన్నారు.






