సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు… ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి
ఎలాంటి ఇబ్బందులు ఉన్నా డయల్ 100 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712667100 కాల్ చేయండి
రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో కలసి పోలీసు ల సహాయక చర్యలు
సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్. ఎం. విజయ్ కుమార్
సిద్దిపేట టైమ్స్ వెబ్ డెస్క్
మొంథా తుఫాన్ ప్రభావం తో వాతావరణ శాఖ నివేదిక మేరకు ఈరోజు, రేపు, ఎల్లుండి జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎస్. ఎం. విజయ్ కుమార్ ఐపీఎస్ తెలిపారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ సూచించారు, వర్షాల కారణంగా ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే డయల్ 100 లేదా సిద్దిపేట పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 8712667100కి ఫోన్ చేయవచ్చని తెలిపారు. పోలీస్ అధికారులు, సిబ్బంది 24 గంటలపాటు అప్రమత్తంగా ఉంటారని కమిషనర్ తెలిపారు. జిల్లాలో వర్షాల కారణంగా చెరువులు, కుంటలు, వాగులు నిండిపొంగుతున్నందున ప్రజలు మరియు రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కోమటి చెరువు, కూడవెల్లి, మోయతుమ్మెద వాగు, శనిగరం చెరువు, గజ్వేల్ పాండవుల చెరువు వంటి ప్రాంతాలను ప్రత్యేకంగా పర్యవేక్షించమని అన్ని పోలీస్ స్టేషన్లకు ఆదేశించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని అధికారులు రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల సమన్వయంతో పని చేయాలన్నారు. రోడ్లు తెగిపోయిన చోట ప్రజలు వెళ్లవద్దని, ప్రమాదకర ప్రాంతాల్లో పోలీసులు ముళ్ల కంచెలు లేదా ఇతర గుర్తులు ఏర్పాటు చేసి హెచ్చరిక ఇవ్వాలని సూచించారు.మట్టితో కట్టిన పురాతన ఇండ్లలో ఉండే ప్రజల వివరాలు తెలుసుకుని, కూలిపోయే ప్రమాదం ఉన్నప్పుడు వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు సహాయం చేయాలని కమిషనర్ ఆదేశించారు. వాగులు, చెరువుల వద్ద పిల్లలు లేదా పెద్దలు ఆడుకోవడం, నీటి ప్రవాహాన్ని తిలకించడం వంటి చర్యలు నివారించాలని సూచించారు. వర్షాల కారణంగా విద్యుత్ స్థంబాలు లేదా పరికరాలను ముట్టుకోవద్దని, లోపాలు ఉంటే వెంటనే విద్యుత్ శాఖకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. వర్షాల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్లు ఏర్పాటు చేయాలని, ఎటువంటి ప్రమాదం జరిగిన వెంటనే కంట్రోల్ రూమ్ లేదా డయల్ 100కు సమాచారం అందించాలని కమిషనర్ అన్నారు.





