సిద్ధిపేట జిల్లాలో మూడు రోజులపాటు భారీ వర్షాలు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – కమిషనర్ డాక్టర్ బి. అనురాధ హెచ్చరిక
సిద్దిపేట, ఆగస్టు 27 (ప్రతినిధి):
జిల్లాలో ఈరోజు, రేపు, ఎల్లుండి వరుసగా మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిద్ధిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్ పత్రిక ప్రకటనలో తెలిపారు.
కమిషనర్ మాట్లాడుతూ, వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని పోలీస్ అధికారులు, సిబ్బంది నిరంతరం జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో చెరువులు, వాగులు, కుంటల వద్ద ప్రత్యక్ష పర్యవేక్షణ జరిపి, అవసరమైతే సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలతో సమన్వయం కలిగి చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా కూడవెల్లి, మోయతుమ్మెద వాగు, శనిగరం చెరువు, కోమటి చెరువు వంటి చోట్ల నీటి ప్రవాహం ఉధృతంగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ప్రజలకు సూచనలు
వర్షాల కారణంగా వరద ఉధృతంతో రోడ్లు తెగిపోతే, ఆ ప్రాంతాలకు గ్రామ ప్రజలు వెళ్లవద్దని సూచించారు.
రహదారుల వద్ద ముళ్ల పొదలు, చెట్లు లేదా అడ్డంకులు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
పాత మట్టి ఇండ్లలో నివసిస్తున్నవారు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు సహకరించాలని సూచించారు.
తల్లిదండ్రులు పిల్లలను వాగులు, చెరువులు, కుంటల వద్దకు వెళ్లనీయకూడదని హెచ్చరించారు.
వర్షాల కారణంగా విద్యుత్ స్థంబాలు లేదా పరికరాలను ముట్టుకోవద్దని, విద్యుత్ సరఫరాలో లోపాలు ఉంటే వెంటనే సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని పిలుపునిచ్చారు.
వినాయక మండపాల నిర్వాహకులకు సూచనలు
వినాయక మండపాలను ఏర్పాటు చేసే నిర్వాహకులు ప్రత్యేకంగా విద్యుత్ భద్రతపై జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రమాదాలు జరగకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని సూచించారు.
అత్యవసర సహాయం కోసం నంబర్లు
జిల్లాలో ఎక్కడైనా సమస్యలు ఎదురైతే ప్రజలు వెంటనే డయల్ 100 లేదా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పోలీస్ కంట్రోల్ రూమ్ (ఫోన్/వాట్సాప్ నంబర్: 8712667100) కు సమాచారం అందించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. పోలీస్ సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉంటారని తెలిపారు.





