ప్రజల ఆరోగ్యంతో చెలగాటం.. బిర్యానీలో ప్లాస్టిక్ ముక్కలు.. సిద్దిపేట కింగ్ ప్యాలెస్ దాబా హోటల్ వద్ద ఉద్రిక్తత
ఇది ఏంటని ప్రశ్నించిన వినియోగ దారులు..
అంతా మా యజమానికె తెలుసు అంటూ..సిబ్బంది నిర్లక్ష్య సమాధానం
సిద్దిపేట టైమ్స్, సిద్ధిపేట
హోటళ్లలో భోజనం చేస్తున్న భోజన ప్రియులకు కొన్ని హోటళ్లు శాపంగా మారుతున్నాయి. ఎందుకంటే హోటలలో పరిశుభ్రత పాటించకపోవడం, భోజనం తయారు చేసేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో కస్టమర్లు హాస్పిటల్ పాలవుతున్న వైనం వెలుగులోకి వస్తున్నాయి. శనివారం సిద్దిపేట పొన్నాల శివారులో ఉన్న కింగ్ ప్యాలెస్ దాబాలో ఓ కస్టమర్ కు బిర్యానీలో ప్లాస్టిక్ ముక్కలు వచ్చిన సంఘటన చోటు చేసుకుంది. దీంతో బిర్యానిలో ప్లాస్టిక్ ముక్కలు వచ్చాయని, ఇదేమిటని సిబ్బంది ని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడమే కాకుండా, ఇదే బిర్యానీని మిగతా వారికి వడ్డించడం గమనార్హం.అంతా మా యజమానికె తెలుసు అంటూ సిబ్బంది తెలపడంతో చివరికి కస్టమర్లు హోటల్ యజమానికి ఫోన్ చేయగా చేసేది ఏమీ లేదు సారీ భయ్యా అని హోటల్ యజమాని పోన్ పెట్టేశాడు.ఈ విషయంపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక బాధితులు కొద్దిసేపు నిర్వాహకులతో గొడవపడి వెళ్లిపోయారు.హోటళ్లు, ఆహార పదార్థాల షాపులను తనిఖీ చేయాల్సి ఉన్నా అధికారుల జాడ లేకపోవడంతో వ్యాపారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. మార్కెట్లో నాణ్యత లేని సరుకులు, ఇతర ఆహార పదార్థాలు జోరుగా విక్రయిస్తుండటంతో వాటిని కొనుగోలు చేస్తున్న ప్రజలు అనారోగ్యం పాలై ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి జిల్లాలో తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.