భూ వివాదం లో పోలీసుల వేధింపులు..రైతు ఆత్మహత్యయత్నం
సిద్దిపేట టైమ్స్, జహీరాబాద్;
భూ తగాదాలు పరిష్కరించాల్సిన పోలీసులే వేధింపులకు గురి చేయడంతో ఒక రైతు ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు. మొగుడంపల్లి మండలం సర్జారావుపేట తండాకు చెందిన ఖీరు అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ విషయానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భూ సంబంధించిన వివాదంలో పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ జహీరాబాద్ లో ఓక రైతు పోలీస్ స్టేషన్ లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. రైతు తో ఉన్న కుటుంబ సభ్యులు హుటాహుటిన సంగారెడ్డి లోని జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు.అతని పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మొగుడంపల్లి మండలం సజ్జారావుపేట తండాకు చెందిన రైతు ఖీరూ అతని సోదరుడు చందర్ మధ్య గత కొంత కాలంగా భూ సమస్యల పై వివాదం కొనసాగుతోంది.ఈ విషయంలో మాట్లాడేందుకు గురువారం రోజున సాయంత్రం జహీరాబాద్ సర్కిల్ కార్యాలయానికి రైతు ఖీరూను పోలీసులు పిలిపించి బెదిరించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులు స్థిరాస్తి వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మనస్థాపనతో రైతు ఖీరూ సర్కిల్ కార్యాలయంలోనే తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో చేరుకున్నాడు.అతని వెంట ఉన్న కుటుంబ సభ్యులు మొదట జహీరాబాద్ లోని ఏరియా ఆసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం సంగారెడ్డిలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రైతు ఖీరూ ఆరోగ్యం నిలకడగానే ఉన్నా బాధ్యులైన పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.గత కొంతకాలంగా అన్నదమ్ముల మధ్య భూ వివాదాలు ఉన్నాయని, పోలీస్ స్టేషన్ ఆవరణలో కూడా తగాదా పడి తమ వద్దకు వచ్చారని సీఐ రవి తెలిపారు.ఈ సందర్భంగా తాము నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తుండగా వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించాడని, వెంటనే కుటుంబ సభ్యులు
ఆసుపత్రికి తరలించారని,తాము ఎవరినీ బెదిరించలేదని తెలిపారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.