మక్కల కొనుగోళ్ళ లో ప్రభుత్వం నిర్లక్ష్యం..
కొనుగోలు కేంద్రం ప్రారంభం తప్ప కొనుగోళ్లు జరుగడం లేదు…
రోజుల తరబడి కొనుగోలు కేంద్రం లోనే రైతులు
బి ఆర్ యస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున రెడ్డి

సిద్దిపేట టైమ్స్ వెబ్ డెస్క్:
హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మక్కల కొనుగోలు కేంద్రాన్ని బుధవారం బీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మక్కల కొనుగోళ్లలో ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం వహిస్తున్నదని విమర్శించారు. “ప్రభుత్వం మక్కల కొనుగోలు కేంద్రాలను అట్టహాసంగా ప్రారంభించినా, ఇప్పటి వరకు ఒక్క క్వింటాల్ కూడా కొనుగోలు జరగలేదు. రైతులు తమ మక్కజొన్న పంటను అమ్మేందుకు మార్కెట్ యార్డుకి తీసుకువచ్చి వారం, పది రోజులు గడిచిపోయినా అమ్ముకోలేని పరిస్థితి నెలకొంది. రైతులు వర్షం, ఎండల మధ్య కుప్పల దగ్గరే కష్టాలు పడుతున్నారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.
సంబంధిత అధికారులు రైతులను రోజూ ‘రేపు మాపు’ అంటూ మోసగిస్తున్నారని, లేదంటే తేమ శాతం ఎక్కువగా ఉందని సాకులు చెబుతున్నారని ఆయన విమర్శించారు. ఈ పరిస్థితి వల్ల రైతులు పెట్టుబడులు పెట్టి పండించిన పంటకు విలువ దక్కడం లేదని, ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి కారణమని అన్నారు. “ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటోంది కానీ ఆచరణలో మాత్రం రైతుల కష్టాల పట్ల పూర్తిగా నిర్లక్ష్యం చూపుతోంది. హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నప్పటికీ, రైతుల సమస్యల పరిష్కారంలో ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. నియోజకవర్గ ప్రజలు ఓట్లు వేసి గెలిపించగా, ఇప్పుడు వారి సమస్యలపై స్పందన లేకపోవడం బాధాకరం” అని పేర్కొన్నారు. ఇకపై ప్రభుత్వం తక్షణం మక్కల కొనుగోళ్లు ప్రారంభించి రైతులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. “ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్య ధోరణి కొనసాగిస్తే, బీఆర్‌ఎస్ పార్టీ రైతుల పక్షాన బలమైన ఉద్యమానికి సిద్ధంగా ఉంటుంది” అని హెచ్చరించారు.





