హుస్నాబాద్ రైతన్నలకు శుభవార్త: ఎట్టకేలకు గౌరవెల్లి ప్రాజెక్టు కు మోక్షం!…
సుప్రీం తీర్పుతో తెరపడిన వివాదం..త్వరలోనే గోదావరి జలాలు
గౌరవెల్లి పనులు వేగవంతం.. ఉత్తమ్‌తో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
హుస్నాబాద్ ప్రాంత రైతాంగానికి శాశ్వత సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన గౌరవెల్లి ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగిపోయాయి. ప్రాజెక్టుకు సంబంధించిన లీగల్ చిక్కుముడులను ఇటీవల సుప్రీంకోర్టు పూర్తిగా పరిష్కరించిందని, ఇక పనులు వేగవంతం చేసి వీలైనంత త్వరగా నీరందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. శనివారం జలసౌధలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో గౌరవెల్లి ప్రాజెక్టు పురోగతిపై సమీక్షా సమావేశం జరిగింది. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు.
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టులో నీళ్లు నింపడానికి, కాలువలు తవ్వడానికి సంబంధించిన భూసేకరణకు అవసరమైన నిధులు తక్షణమే విడుదల చేయడానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి అంగీకరించారని మంత్రి ప్రభాకర్ తెలిపారు. దీంతో నిధుల కొరత సమస్య తీరినట్లైంది. పనుల వేగవంతానికి అడ్డంకులు తొలగినప్పటికీ, ప్రస్తుతం 55 ఎకరాల పునరావాసానికి సంబంధించిన ఒక చిన్న సమస్య పెండింగ్‌లో ఉందని మంత్రి వెల్లడించారు. ఈ సమస్యను కూడా పరిష్కరించాలని కోరుతూ బాధిత ప్రజలను తీసుకొచ్చి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి విన్నవించామన్నారు. ఈ సమస్యను త్వరగా పరిష్కరించడానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారని పేర్కొన్నారు. గౌరవెల్లికి సంబంధించిన అన్ని అడ్డంకులు త్వరలోనే పూర్తిగా తొలగిపోనున్నాయని, ప్రభుత్వం పరంగా అన్ని అంశాలు వెంటవెంటనే పరిష్కారం చేసుకునే దిశలో కార్యాచరణ కొనసాగుతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ప్రాజెక్టు బండ్ నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని, ఇక ప్రధానంగా కాలువలు తవ్వే పనులు వేగంగా పూర్తి చేయాల్సి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కాలువలకు సంబంధించిన భూసేకరణలో రైతులు, స్థానిక ప్రజలు సహకరించాలని ఆయన ఈ సందర్భంగా అభ్యర్థించారు. “రైతులు సహకరిస్తే, కాలువలు పూర్తి చేసినట్లయితే గ్రామగ్రామాన గౌరవెల్లి నుండి గోదావరి నీళ్లు వచ్చే అవకాశం ఉంది. లక్ష ఎకరాలకు పైగా ఆయకట్టు ఉన్న ఎత్తైన పీఠభూమిలో ఉన్న గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత పూర్తిగా నాది,” అని మంత్రి స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టు, గత పదేళ్లుగా కేసీఆర్ కుర్చీ వేసుకొని కడతామని చెప్పినప్పటికీ పూర్తి కాలేదని ఆయన గుర్తు చేశారు. ఇక ఎవరినీ నిందించకుండా, ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రాంత రైతాంగానికి నీళ్లు ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.





