తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులకు త్వరగా అనుమతులు ఇవ్వండి
కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శికి మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
తెలంగాణ రాష్ట్రంలో గౌరవెల్లి సహా వివిధ నీటిపారుదల ప్రాజెక్టులకు పర్యావరణ, అటవీ శాఖల అనుమతులు త్వరితగతిన ఇవ్వాల్సిందిగా కేంద్ర అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. నేడు న్యూఢిల్లీలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖల కార్యదర్శి తన్మయికుమార్‌ను మంత్రి స్వయంగా కలిసి ఈ విషయమై వినతి చేశారు. ఈ సమావేశంలో సెక్రటరీ కోఆర్డినేషన్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ కూడా పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గౌరవెల్లి ప్రాజెక్టు సహా అనేక నీటిపారుదల ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధికి కీలకమని, వాటి ద్వారా ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు అందించే అవకాశం ఉందని కేంద్ర కార్యదర్శికి వివరించారు.
2025 మేలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన ‘వనశక్తి’ తీర్పును ఇటీవల వెనక్కి తీసుకున్న నేపథ్యంలో, ఈ అంశంపై న్యాయసలహా తీసుకొని త్వరగా అనుమతుల మంజూరు చేపడతామని తన్మయికుమార్ స్పష్టంచేసినట్టు మంత్రి తెలిపారు. కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ విదేశీ పర్యటనలో ఉండడంతో, ఆయన స్థానంలో కార్యదర్శిని కలసి ప్రాజెక్టుల వేగవంత అనుమతులపై చర్చించినట్టు మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో సాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు ఈ అనుమతుల మంజూరు అత్యవసరమని కేంద్రం దృష్టికి తెచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.




