ప్రమాద అంచున ఖాజీపూర్ చెరువు.. ఏకమైన గ్రామస్తులు
– చెరువును కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న గ్రామస్తులు
సిద్దిపేట టైమ్స్ అక్బరుపేట/భూంపల్లి
ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు చెరువు నిండుకుండలా మారింది. పంటలకు సరిపడా నీరు చెరువు ద్వారా పంటలకు అందుతుందని గ్రామస్తులు ఆనందపడేలోపే ఆవిరయ్యింది. గ్రామస్తులంతా ఏకమై చెరువు నీటిని కాపాడుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా అక్బర్ పేట- భూంపల్లి మండలం ఖాజీపూర్ చెరువు ఇటీవల కురిసిన వర్షానికి నిండుకుండను తలపిస్తుంది. గత రాత్రి చెరువుకు బుంగ పడడంతో చెరువు నీరు పంట పొలాల్లోలకి భారీగా వెళుతున్న విషయాన్ని గ్రామస్తులు గ్రహించారు. ఎలాగైనా సాగునీటిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ట్రాక్టర్లు, జెసిబిల సహాయంతో మట్టిని పోస్తూ బుంగను పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు. బుంగ పడి నీరు బయటికెళ్తే తీవ్ర పంట నష్టంతో పాటు ఇతర గ్రామాల్లో ఉన్న చెరువులకు భారీగా నీరు చేరి తెగిపోయే ప్రమాదం పొంచి ఉందని గ్రామస్తులు వాపోతున్నారు. జరగబోయే ప్రమాదాలు తప్పించడంతోపాటు చెరువు నీటిని కాపాడుకోవాలనే నిర్ణయం గ్రామస్తుల అందర్నీ ఏకం చేసింది. పదుల సంఖ్యలో ట్రాక్టర్ ల ద్వారా మట్టి ,కంకర ,రాళ్లను వేస్తూ చెరువుకు పడిన బుంగను పూడ్చే ప్రయత్నం ఫలిస్తుందో లేదో వేచి ఉండాల్సిందే. అధికారులు సైతం స్పందించి వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని కోరుతున్నారు.







