హుస్నాబాద్ పట్టణంలో గణపతి లడ్డూ చోరీ !!..
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం స్నేహ సాయి నగర్ కాలనీలో ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. గణేష్ నవరాత్రి ఉత్సవాలు స్నేహ సాయి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిసంవత్సరం ఘనంగా నిర్వహించబడుతున్నాయి. రోజువారీ ప్రత్యేక పూజలు, నిత్యం అన్నదాన కార్యక్రమం జరుగుతుండగా, ఈ సంవత్సరం మాత్రం విచిత్ర సంఘటన కాలనీవాసులను కలవరపరిచింది.
నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గణపతి వద్ద ఉంచిన వినాయకుడి లడ్డును దొంగిలించారు. ఈ సంఘటనను చూసిన కాలనీ ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇలాంటి దారుణ చర్యలు ఉత్సవాల పవిత్రతను దెబ్బతీస్తున్నాయని విచారం వ్యక్తం చేస్తున్నారు.
కాలనీలోని నివాసులు ఈ ఘటనపై విచారణ జరిపి, అసలైన దొంగను పట్టుకోవాలని కోరుతున్నారు. ముఖ్యంగా, మాజీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అక్కు శ్రీనివాస్ నివాసం పక్కనే ఈ ఘటన జరగడం మరింత చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం కాలనీ కమిటీ పోలీసులకు సమాచారం అందించగా, “లడ్డూ దొంగతనం వెనుక ఉన్న వారి ఉద్దేశ్యం ఏమిటి?” అనే ప్రశ్న స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.






