కొత్తపల్లి నుండి హుస్నాబాద్ వరకు 4 లైన్ల రోడ్ల విస్తరణకు రూ. 77.20 కోట్లు మంజూరు
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
కొత్తపల్లి నుండి హుస్నాబాద్ వరకు నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ పనులలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుండి MDR ప్లాన్ ద్వారా ప్యాకేజీ -2 లో రూ. 77.20 కోట్లు మంజూరు అయినట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖా మాత్యులు పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయినట్లు తెలిపారు. మొత్తం 21 కి.మీ లకు గాను రూ. 163 కోట్ల వ్యయానికి ప్రతిపాదనలు పంపగా, మొదటి విడత లో 11 కి.మీ లకు గాను రూ. 77.20 కోట్లు మంజూరు అయినట్లు, మిగతా నిధులు రెండవ విడత లో త్వరలోనే మంజూరు కానున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నియోజకవర్గ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా రోడ్ల అభివృద్ధి, ఆధునీకరణకు నిధులు మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్న కొత్తపల్లి నుండి హుస్నాబాద్ వెళ్ళే ప్రయాణికుల సమస్యలు తీర్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కి, రోడ్లు, భవనాల శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. కరీంనగర్ నుండి హుస్నాబాద్ వైపు 4 లైన్ల రోడ్డు కు నిధులు మంజూరు కావటంతో నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
