మాజీ మంత్రి హరీష్ రావు కు పితృవియోగం
సిద్దిపేట టైమ్స్ హైదరాబాద్, అక్టోబర్ 28 (మంగళవారం):


మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే హరీశ్ రావు ఇంట విషాదం నెలకొంది. హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ వృద్ధాప్య సమస్యలతో ఈ రోజు మంగళవారం ఉదయం కన్నుమూశారు. కుటుంబ సభ్యులు, బంధువులు, రాజకీయ నాయకులు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సత్యనారాయణ సిద్దిపేట ప్రాంతంలో ప్రజలకు దగ్గరైన వ్యక్తిగా గౌరవనీయ స్థానం సంపాదించుకున్నారు. జీవితాంతం సాదాసీదా జీవన విధానాన్ని అనుసరించిన ఆయన మరణం హరీష్ రావు కుటుంబానికి తీరని లోటుగా మారింది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్), పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ స్పీకర్ పొచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సహా అనేక మంది బీఆర్ఎస్ నాయకులు సత్యనారాయణ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హరీష్ రావు కుటుంబానికి సానుభూతి తెలుపుతూ, ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. సత్యనారాయణ పార్థివదేహం హైదరాబాద్లోని క్రిన్స్ విల్లాస్లో సందర్శనార్థం ఉంచబడింది. అనంతరం అంత్యక్రియలు ఈ రోజు మధ్యాహ్నం ఫిల్మ్ నగర్ మహాప్రస్థానంలో జరగనున్నాయి. తండ్రి మృతితో హరీష్ రావు తీవ్ర మనోవేదనకు గురయ్యారని, పలువురు నాయకులు ఆయన నివాసానికి చేరుకుని పరామర్శించినట్లు సమాచారం.





