ఏపీకి నిధుల వరద.. తెలంగాణా ముఖాన బురద!!
– బీజేపీ ఎంపీలు వెంటనే రాజీనామా చేయాలి
– తెలంగాణ హామీలేమయ్యాయి
– ఏపీ, బీహార్ తప్ప మిగతా రాష్ట్రాలను చిన్నచూపు చూడటం బాధాకరం
– రాష్ట్ర హౌజ్ ఫెడ్ మాజీ చైర్మైన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణా కేటాయింపులపై రాష్ట్ర హౌజ్ ఫెడ్ మాజీ చైర్మైన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి స్పందించారు. తెలుగు కోడలు నిర్మలా సీతారామన్ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఏమైనా భారీగా బడ్జెట్ లో నిధులు కేటాయిస్తారని ఆశించామని, కానీ దక్కింది శూన్యం అన్నారు. రూ. 48 లక్షల ఇరవై ఒక్కవేల కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పెద్దపీట వేశారని ఆయన ఆరోపించారు. బడ్జెట్ లో తెలంగాణా ఊసే లేదని, అసలు మొత్తం బడ్జెట్ లో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరం అని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రానికి మరొకసారి దక్కింది గుండు సున్నానే అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విజన చట్టంలో హామీలను అమలుపర్చలేదన్నారు. తెలంగాణా హామీలెక్కడ అంటూ అయన ధ్వజమెత్తారు. ములుగు యూనివర్సిటీకి అదనపు నిధుల ప్రస్తావన లేదని, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేదన్నారు. ఏపీకి నిధుల వరద కురిపించి తెలంగాణా ముఖాన బురద కొట్టారన్నారు. ఏపీ, బీహార్ తప్ప మిగతా రాష్ట్రాలను చిన్నచూపు చూడటం బాధాకరం అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం పేరు చెప్పిన ప్రతిసారి ఎక్కడ కూడా తెలంగాణ ఆనే పదం ప్రస్తావించలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన భారీ నిధుల పట్ల మాకు ఎలాంటి బాధ లేదు, సంతోషమే అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు, బీహార్ కి మాత్రమే ఇచ్చి మిగిలిన 26 రాష్ట్రాలను చిన్న చూపు చూడడం నిజంగా బాధాకరం అని విమర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు వెళ్లి ఢిల్లీలో అడిగిన వాటిని కూడా పట్టించుకోలేదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో 8 స్థానాలను బీజేపీ జాతీయ పార్టీని గెలిపిస్తే ఏం జరిగిందో తెలంగాణ ప్రజలు ఆలోచించాలన్నారు. 8 మంది ఎంపీలను ఇచ్చినా బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు గుండు సున్నా నిధులు ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారన్నారు.