ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులను నియంత్రించాలి
– పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు,ఇతర వస్తువుల అమ్మకాల పై విద్యాశాఖ కఠినంగా వ్యవహరించాలి
సిద్దిపేట టైమ్స్ , దుబ్బాక ప్రతినిధి:
దుబ్బాక మండలంలో ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలనీ,పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు,ఇతర వస్తువుల అమ్మకాల పై విద్యాశాఖ కఠినంగా వ్యవహరించాలనీ కోరుతూ పీ.డీ.ఎస్.యు
ఆధ్వర్యంలో దుబ్బాక మండల విద్యాశాఖ అధికారి జోగు ప్రభుదాస్ గారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పీ.డీ.ఎస్.యు రాష్ట్ర అధ్యక్షులు ఎస్.వి.శ్రీకాంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేస్తామని ప్రకటించినప్పటికీని ఇంకా అమలు పరచకపోవడంలో ఆంతర్యం ఏంటో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలనీ డిమాండ్ చేశారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రైవేటు పాఠశాలలో పేద విద్యార్థులకు 25% ఉచిత అడ్మిషన్లు ఇవ్వాలని అన్నారు. చట్టాన్ని అమలు చేయాల్సిన విద్యాశాఖ అధికారులే దాన్ని తీవ్రంగా ఉల్లంఘిస్తూ ఇష్టంవచ్చిన విధంగా అనుమతులు ఇస్తూ విద్యా వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే దుబ్బాక మండలంలో ఉన్న నిబంధనలు పాటించని ప్రైవేటు పాఠశాలల పై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించి అనుమతులకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పాఠశాలలను సీజ్ చేయాలని కోరారు .పాఠశాలల్లో యూనిఫామ్స్, టై,బెల్ట్, షూస్, బ్యాగ్స్,పాఠ్య పుస్తకాలు అమ్మకుండా విద్యాశాఖ కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.విద్యార్థులకు గాలి ,వెలుతురు ,క్రీడ మైదానాలు లేకుండా కమర్షియల్ బిల్డింగులలో నిర్వహిస్తున్న ప్రైవేటు పాఠశాలల్లో ఈ విద్యాసంవత్సరం అడ్మిషన్లు తీసుకోకుండా చర్యలు తీసుకోవాలని,తప్పుడు పద్ధతుల్లో ఫైర్ సేఫ్టీ,మున్సిపల్ అనుమతులు తీసుకున్న పాఠశాలల పై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను కోరారు.లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీ.డీ.ఎస్.యు జిల్లా ప్రధాన కార్యదర్శి గ్యార గణేష్ మరియు బన్నీ ,రాజు తదితరులు పాల్గొన్నారు.
Posted inదుబ్బాక
ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులను నియంత్రించాలి
