విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్ ను వెంటనే చెల్లించాలి
బీసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు, నాయకుల నిరసన
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
పెండింగ్ లో ఉన్న ఫీజు రీయంబర్స్మెంట్ ను వెంటనే విద్యార్థులకు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బుధవారం హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు, నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ కన్వీనర్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ మాట్లాడుతూ… విద్యార్థులకు రావలసిన స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని అన్నారు. పెండింగ్లో ఉన్న రూ.3 వేల కోట్లను ఫీజు రీయంబర్స్మెంట్ ను విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు. మెస్ చార్జీలు, స్కాలర్షిప్ లు వెంటనే పెంచాలని బీసీ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు, ఇప్పటివరకు 6000 కోట్ల రూపాయలు విద్యార్థులకు ప్రభుత్వం బకాయి ఉంటే నామ మాత్రంగా కేవలం 1500 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేశారని అన్నారు, పూర్తిస్థాయిలో బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు, దీంతో ఉద్యోగాలకు, పోటీ పరీక్షలకు, పైచదువులకు, ముందడుగు వేయలేకుండా ఉందన్నారు, చివరకు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొంటుందని అన్నారు, ఒకవైపు నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నా ఇంకా మెస్ చార్జీలు పెంచడం లేదని దాంతో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం పెట్టడం లేదన్నారు, వెంటనే స్కాలర్షిప్ లు పెంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రైవేటు పాఠశాల, కళాశాలలో 25% కోట చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని బీసీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. తక్షణమే విద్యార్థుల కు న్యాయం చేయకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మండల అధ్యక్షులు వెల్దండి సంతోష్, మండల ప్రధాన కార్యదర్శి గాదాసు రాంప్రసాద్, బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షులు కన్నోజు చొక్కా చారి, బీసీ నాయకులు వరియో గుల అనంతస్వామి, పోలోజు రాజేందర్, మునిగంటి శంకర్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.