లారీ, స్కూటీ ఢీకొని తండ్రి కొడుకు దుర్మరణం..
స్కూటీ పై వెళ్తున్న తండ్రీకొడుకులు మృతి, మరో కొడుకుకు తీవ్ర గాయాలు..
సిద్దిపేట టైమ్స్ దౌల్తాబాద్
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని తిర్మలాపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులు మృతి చెందటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం …..దౌల్తాబాద్ మండలం తిర్మలాపూర్ గ్రామానికి చెందిన చిట్యాల వేణు గ్రామంలో టైలరింగ్( దర్జీ) చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల కొత్తగా కొన్న స్కూటీపై తన ఇద్దరు కుమారులు అయిన శివ, విష్ణులతో తండ్రి వేణులు అత్తగారి ఇంటికి మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలంలోని ధర్పల్లి గ్రామానికి తన స్కూటీపై ముగ్గురు బయలుదేరారు. దౌల్తాబాద్ మండలం చెట్లనర్సంపల్లి గ్రామం వద్ద రోడ్డు క్రాస్ దాటుతున్న (చేస్తున్న) క్రమంలో గజ్వేల్ నుండి చేగుంట కు వెళ్తున్న లారీ వేగంతో వచ్చి స్కూటీకి ఢీకొట్టడంతో చిట్యాల వేణు 38, పెద్ద కొడుకు శివ 18 అక్కడిక్కడే మృతి చెందారు. చిన్న కొడుకు చిట్యాల విష్ణు 14 కు తీవ్ర గాయాలు కాగా గజ్వేల్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న దౌల్తాబాద్ ఎస్ఐ శ్రీరామ్ ప్రేమ్ దీప్ తన సిబ్బంది తో కలిసి ఘటన స్థలానికి చేరుకుని గాయాలు అయిన విష్ణు ను గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. మృతి చెందిన ఇద్దరిని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. మృతునికి భార్య నాగలక్ష్మి ఉన్నారు. బంధువుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.