ఆర్డిఓ కార్యాలయం ఎదుట ఆక్రమణదారులపై చర్యలు తీసువాలని ఆమరణ నిరాహార దీక్ష
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్డివో కార్యాలయం ఎదుట పలువురు పోతారం (ఎస్) గ్రామస్తులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. తమ భూములను అక్రమంగా పట్టా చేయించుకున్న ఆక్రమణదారులపై చర్యలు తీసుకొని, తమ భూములను తమకు ఇప్పించాలని డిమాండ్ చేశారు. పోతారం గ్రామ శివారులో తమకు చెందిన భూములను కొంతమంది భూ ఆక్రమణదారులు అక్రమంగా వారి పేరిట పట్టాలు చేయించుకున్నారని బాధితులు తెలిపారు. ఈ విషయమై స్థానిక ఆర్డివో కార్యాలయంలో ఫిర్యాదు చేయగా అధికారులు భూములను సర్వే చేసి పంచనామ నిర్వహించి తమకు న్యాయం చేస్తామన్నారని, కానీ ఇంతవరకు ఎలాంటి న్యాయం చేయలేదన్నారు. ఇప్పుడు ఆక్రమణదారులు వారి పేరు మీద చేయించుకున్న భూమిని యదేచ్చగా మరొకరి పేరు మీద మార్చుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఆ భూములపై ఆధారపడిన 10 నుండి 12 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొందన్నారు. తమకు న్యాయం చేసేంతవరకు నిరాహార దీక్షను కొనసాగిస్తామన్నారు.