హుస్నాబాద్‌లో రైతుల నిరసన – యూరియా సరఫరా పెంచాలని డిమాండ్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్, ఆగస్టు 11:

రైతులకు సరిపడా యూరియాను అందించాలని డిమాండ్ చేస్తూ హుస్నాబాద్ పట్టణంలోని గ్రోమోర్ ఎరువుల షాప్ ముందు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతులు నిరసన తెలిపారు. ప్రస్తుతం వరి నాట్ల సీజన్లో ఉండగా యూరియా కొరత తీవ్రంగా ఉందని వారు ఆరోపించారు.
నెల రోజుల కిందటే వరి నాట్లు ప్రారంభమైనప్పటికీ, ఆ పంటలకు అవసరమైన ఎరువులు సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని బిఆర్ఎస్ పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున రెడ్డి మండిపడ్డారు. హుస్నాబాద్ ప్రాంతంలో ఎన్ని ఎకరాల్లో పంట సాగవుతుందో, ఎంత ఎరువు అవసరమో వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఉన్నా సరఫరా జరగడం లేదని విమర్శించారు.
రైతులు తమ వ్యవసాయ పనులు వదిలిపెట్టి పట్టణంలోని ఫర్టిలైజర్ షాప్‌లను చుట్టుముట్టే పరిస్థితి వచ్చిందని, ఒక ఎకరానికి ఒక యూరియా బస్తా మాత్రమే ఇస్తున్నారని, రెండు ఎకరాలు ఉన్న రైతులు కేవలం రెండు బస్తాలు మాత్రమే పొందుతున్నారని చెప్పారు. అంతేకాకుండా ఎరువులు కొనుగోలు సమయంలో అవసరం లేని పెస్టిసైడ్లు బలవంతంగా కొనిపిస్తున్నారని, దీని వల్ల రైతులకు ఆర్థిక భారం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఫర్టిలైజర్ షాప్ యాజమానులు ఎరువులను బ్లాక్ చేస్తే, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎరువులకు లింక్ సేల్స్ అమలు కాకుండా చూడాలని వారు వ్యవసాయ శాఖ అధికారులను కోరారు.
ఈ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తక్షణమే స్పందించి హుస్నాబాద్ ప్రాంతంలో ఉన్న యూరియా కొరతను నివారించాలని, రైతులకు తగిన ఎరువు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు.
ఈ నిరసనలో సిపిఎం నాయకులు గూగులోతు శివరాజ్ నాయక్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు మేకల వికాస్ యాదవ్‌తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.