యూరియా కోసం రైతులకు తప్పని తిప్పలు..
ఉదయం నుంచి క్యూ కట్టిన రైతులు..
అయినా దొరకని యూరియా బస్తాలు..
సిద్దిపేట టైమ్స్, నంగునూరు, ఆగస్టు 30:

యూరియా బస్తాల కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. సిద్ధిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని పీఏసీఎస్ వద్ద శనివారం యూరియా టోకెన్లు జారీ చేయగా, టోకెన్ల వారీగా రైతు వేదిక వద్ద బస్తాలను పంపిణీ చేశారు. యూరియా బస్తాల కోసం వెయ్యి మందికి పైగా శనివారం తెల్లవారుజాము నుంచి క్యూ కట్టారు. వరుసలో నిలబడినప్పటికీ రైతులందరికీ సరిపోయే బస్తాలు దొరకక పోవడంతో రైతుల నిరాశతో వెనుదిరిగారు. రాష్ట్రంలో యూరియా కొరత లేదని ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నప్పటికీ, క్షేత్ర స్థాయిలో రైతుల కష్టాలు తీరడం లేదు. ఇందుకు యూరియా కోసం రైతులు క్యూ కట్టడమే సజీవ సాక్ష్యం. కేవలం 560ల బస్తాలు మాత్రమే అందుబాటులో ఉండడంతో సగం మందికి కూడా యూరియా దక్కలేదు. రాజగోపాల్ పేట పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. గంటల తరబడి వేచి చూసిన రైతులు యూరియా దొరకదని తెలిసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు ప్రభుత్వంపై ఆవేదనను వెళ్లగక్కారు. యూరియా అందుబాటులో లేక పంటల సాగుకు తాము ఇబ్బందులు పడుతుంటే, కొరత లేదని ప్రభుత్వం చెప్పడంపై రైతులు మండి పడ్డారు. ప్రభుత్వం సరైన ప్రణాళికతో యూరియాను అందుబాటులో ఉంచడంలో విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి యూరియాను రైతులకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. యూరియా లేక తమ పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం గుర్తించి, తగిన చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు.






