మున్సిపల్ మరియు నేషనల్ హైవే అధికారులు హుస్నాబాద్ పట్టణ ప్రజలకు హైవే విస్తరణ గురించి వాస్తవాలు వెల్లడించాలి
బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్.
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

మున్సిపల్ మరియు నేషనల్ హైవే అధికారులు హుస్నాబాద్ పట్టణ ప్రజలకు హైవే విస్తరణ గురించి వాస్తవాలు చెప్పాలని బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ ఒక ప్రకటనలో కోరారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో నేషనల్ హైవే నిర్మాణంలో భాగంగా మెయిన్ రోడ్డు కిరువైపులా నిర్మిస్తున్న డ్రైనేజీలలో కేవలం రోడ్డు మీద ఉన్న వరద నీరు పోవడానికి నిర్మించడం జరిగిందని నేషనల్ హైవే అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి నిబంధనల ప్రకారం హైవే డ్రైనేజీ కి అవతల మున్సిపాలిటీ ప్రత్యేక డ్రైనేజ్ 6 -8 ఫీట్లతో, మంచినీటి పైపులైనులు, విద్యుత్ స్తంభాలు మరియు సర్వీస్ రోడ్డు కూడా నిర్మించాల్సి ఉంటుంది. కాని ఈ విషయంలో మున్సిపల్ కమిషనర్, పాలకవర్గం ఇంకా ఎన్ని ఫీట్ల వరకు సెట్ బ్యాక్ కావాలనే విషయం ప్రజలకు స్పష్టంగా తెలియజేయడం లేదని, ప్రస్తుతం మెయిన్ రోడ్డు భవన యజమానులు స్వతహాగా కూల్చి వేస్తున్నారు కాబట్టి వారికి ఇప్పుడే స్పష్టమైన ప్రకటన ద్వారా తెలియజేస్తే పూర్తిస్థాయిలో సెట్ బ్యాక్ అవుతారని, అదేవిధంగా హైవే రోడ్డు ఎత్తుగా నిర్మించడం వల్ల అంబేద్కర్ చౌరస్తాలోని పోలీస్ కంట్రోల్ రూమ్ నుండి యూకో బ్యాంకు పరిసరాల వెనుక భాగం వెంకటేశ్వర టాకీస్ వరకు వరద నీరు వెనుకకు వచ్చే ప్రమాదం ఉందన్నారు. కాబట్టి కమిషనర్ మరియు పాలకవర్గం ప్రజలకు ఇబ్బంది కలగకుండా వెంటనే విస్తరణ గురించి స్పష్టమైన ప్రకటన చేయాలని బిఎస్పి పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పచ్చిమట్ల రవీందర్ గౌడ్ కోరారు.
