హుస్నాబాద్ పట్టణంలో మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన
100 రోజుల ప్రణాళికలో భాగంగా ఘనంగా నిర్వహించిన మెప్మా ఫెస్టివల్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్, జూలై 30:

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 100 రోజుల ప్రణాళికలో భాగంగా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో బుధవారం రోజు మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకాలకు ప్రత్యేక ఫెస్టివల్ నిర్వహించబడింది. ఈ వేడుకలు హుస్నాబాద్ మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో ఎంతో ఉత్సాహభరితంగా జరిగాయి. మహిళా సంఘాల సభ్యులు తాము తయారుచేసిన వివిధ ఉత్పత్తులను ప్రదర్శించారు. ఈ ఉత్పత్తుల్లో: తినుబండారాలు, పిండివంటలు, మొక్క పిండితో తయారుచేసిన ప్లేట్లు, కప్స్, కూరగాయలు, గాజులు, బట్టలు, డ్రెస్ మెటీరియల్స్, తదితర వస్తువులు విస్తృతంగా ప్రదర్శింపబడ్డాయి.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ మాట్లాడుతూ –> “పట్టణ మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం నుండి ఇందిరా మహిళా శక్తి, బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి వంటి పథకాల ద్వారా రుణాలు మంజూరు చేస్తున్నాం. ఈ ఏడాది హుస్నాబాద్ పట్టణంలోని మొత్తం 503 సంఘాల్లో, 23 సంఘాలకు రూ.2 కోట్ల రుణాలు మంజూరు చేయడం జరిగింది,” అని తెలిపారు. అలాగే, మహిళలు స్వయం ఉపాధికి దోహదపడే విధంగా అన్ని రంగాల్లో ముందుండి ఆర్థికంగా ఎదగాలని కమిషనర్ ఆకాంక్షించారు. ఈ తరహా కార్యక్రమాల ద్వారా మహిళలు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ, స్వయం ఉపాధి దిశగా ముందడుగు వేస్తుండటం అభినందనీయమని పలువురు అభిప్రాయపడ్డారు. పట్టణ అభివృద్ధిలో మహిళల పాత్ర మరింత బలపడేలా ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఎడిఎంసీ సంతోషిమాత, మేనేజర్ సంపత్, మున్సిపల్ సిబ్బంది, ఆర్‌పీలు ఓబిలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొని ఫెస్టివల్‌ను విజయవంతం చేశారు.