కోహెడలో నార్కోటిక్స్ డాగ్స్ తో మత్తుపదార్థాల తనిఖీలు
సిద్దిపేట టైమ్స్ కోహెడ, ఆగస్టు 11:
కోహెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని జ్యోతిరామ్ నాయక్ తండా సహా పలు గ్రామాలు మరియు పరిసర ప్రాంతాల్లో గంజాయి, ఇతర మత్తు పదార్థాల నిర్మూలన కోసం పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. నార్కోటిక్స్ డాగ్స్ సహాయంతో అనుమానాస్పద ప్రదేశాలు, కిరాణా దుకాణాలు, టీ హోటళ్లు, పాన్ షాపులు తదితర ప్రాంతాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా కోహెడ ఎస్ఐ అభిలాష్ మాట్లాడుతూ, పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మత్తుపదార్థాలపై పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గంజాయి, మత్తు కలిపిన చాక్లెట్స్ లేదా ఇతర మత్తు పదార్థాలను ఎవరు కలిగి ఉన్నా, అక్రమంగా రవాణా చేసినా, విక్రయించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
జనసామాన్యం ‘గంజాయి రహిత జిల్లా’ లక్ష్యానికి సహకరించాలని ఆయన కోరారు. “తాత్కాలిక ఆనందం కోసం యువత జీవితాలను నాశనం చేసుకోకూడదు” అని సూచించారు. మత్తుపదార్థాలపై సమాచారం ఉంటే వెంటనే డయల్ 100, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో టోల్‌ఫ్రీ నెంబర్ 1908 లేదా హుస్నాబాద్ పోలీసులకు సమాచారం అందించవచ్చని చెప్పారు.
తనిఖీల్లో పోలీస్ స్టేషన్ సిబ్బంది, డాగ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు.