హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ సమీక్ష
రోడ్లు, భవనాలు, ఇళ్లు, నీటి ప్రాజెక్టులు — అన్ని పనుల్లో వేగం పెంచాలని ఆదేశాలు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాల్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ — సిద్దిపేట–ఎలుకతుర్తి నేషనల్ హైవే పనుల్లో వేగం పెంచాలని, బస్వాపూర్, పందిళ్ల వద్ద భూసేకరణ పనులు నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. హుస్నాబాద్–కొత్తపల్లి నాలుగు వరుసల రహదారి పనుల్లో ఎలక్ట్రికల్ లైన్ షిఫ్టింగ్, చెట్ల తొలగింపు వేగంగా చేయాలని సూచించారు. కోహెడ–సముద్రాల రోడ్, హుస్నాబాద్–రామవరం రోడ్ పనుల్లో సేఫ్టీ సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. గ్రామపంచాయతీ భవనాలు, అంగన్వాడీ సెంటర్లకు భూమి సేకరణ పనులు తహసీల్దార్, ఎంపీడీవో, ఇంజనీర్ల సమన్వయంతో పూర్తి చేయాలని ఆదేశించారు. మున్సిపల్ పరిధిలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం 100% గ్రౌండింగ్ కావాలని, లబ్ధిదారుల పేమెంట్లు పెండింగ్ లేకుండా చూడాలని ఆదేశించారు. పంట నమోదు ప్రక్రియ 100% పూర్తి చేయాలని, యాసంగి విత్తనాల పంపిణీ వచ్చే నెలలో ప్రారంభించాలని చెప్పారు.
కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ — “అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తే అభివృద్ధి వేగంగా జరుగుతుంది, ప్రజలకు సకాలంలో సౌకర్యాలు అందుతాయి” అని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీవో రామమూర్తి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.






