గ్రామ గ్రామాన పండగలా ‘ఇందిరా మహిళా శక్తి’ చీరల పంపిణీ
హుస్నాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ లో మహిళలకు ప్రత్యేక యూనిట్లు..
గౌరవెల్లి ప్రాజెక్ట్ పై సుప్రీం కోర్టు కేసు తొలగింది ..హుస్నాబాద్ ప్రాంతాన్ని సస్య శ్యామలం చేస్తాం
అమరవీరుల స్థూపం వద్ద 10 ఎకరాల్లో మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేస్తాం
మహిళల అభ్యున్నతే మా ప్రభుత్వం లక్ష్యం – మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ :

ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న ఇందిరా మహిళా శక్తి చీరలను హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ, చిగురు మామిడి, సైదాపూర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, అక్కన్నపేట, హుస్నాబాద్ మండలాల్లో గ్రామ గ్రామాన పండగ వాతావరణంలో పంపిణీ చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ మహిళలకు బొట్టు పెట్టి చీరలను అందజేయగా, ఆడపడుచులు సంతోషం వ్యక్తం చేశారు.
మంత్రి మాట్లాడుతూ … “హుస్నాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం. గౌరవెల్లి ప్రాజెక్ట్‌పై సుప్రీం కోర్టులో ఉన్న కేసు తొలగింది. త్వరలో కాలువల తవ్వకాలు ప్రారంభించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాము” అన్నారు. ఇండస్ట్రియల్ కారిడార్‌లో మహిళలకు ప్రత్యేక యూనిట్లు ఏర్పాటు చేసేందుకు అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. అమరవీరుల స్థూపం సమీపంలో శిల్పారామంలా 10 ఎకరాలలో ‘మహిళా శక్తి బజార్’ ఏర్పాటు చేసి, మహిళల ఉత్పత్తులను ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాల్లో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, గ్యాస్ సిలిండర్‌కు రూ.500 సబ్సిడీ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు.
“గత 10 ఏళ్లలో ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇప్పుడేమో ప్రతి అర్హ కుటుంబానికి అందిస్తున్నాం. మా లక్ష్యం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం” అని చెప్పారు. యువతకు విద్య ముఖ్యం అని చెప్పిన మంత్రి, “ఇంటింటి సర్వేలో ఉన్నత విద్యనభ్యసించిన కుటుంబాలు మాత్రమే ఎదుగుతున్నాయి. మహిళలు తమ పిల్లల చదువుపై దృష్టి పెట్టాలి” అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఇప్పటికే మంజూరైన 3,500 ఇందిరమ్మ ఇండ్ల పనులు వేగంగా జరుగుతున్నాయని, మరిన్ని 3,500 ఇండ్లు త్వరలో మంజూరు చేస్తామని వెల్లడించారు. ప్రతి మండల, గ్రామ సమైక్యాలకు భవనాల కోసం స్థలాలు సేకరించి నిధులు కేటాయిస్తామని తెలిపారు. హుస్నాబాద్‌ను ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా మార్చేందుకు గ్రామ గ్రామాన స్టీల్ బ్యాంకుల ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. “ప్రతి మహిళకు సోదరుడిలా అండగా ఉంటాను. భవిష్యత్తులో మహిళలు ఆర్థికంగా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి” అని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సిద్ధిపేట కలెక్టర్ హైమవతి, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి, హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరిష్, అదనపు కలెక్టర్లు, గ్రంథాలయ సంస్థ, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.






