బడికి వెళ్ళారా…. పనికా..!
బడి వేళల్లో దుంగలు మోస్తున్న విద్యార్థులు..
ఉపాధ్యాయుల తీరుపై పేరెంట్స్ ఆగ్రహం..
సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్..
ది సిద్దిపేట టైమ్స్, చిన్నకోడూరు

పుస్తకాలు చేతపట్టి బడిలో గడపాల్సిన విద్యార్థులు… బడి బయట దుంగలు మోస్తూ కనిపించారు. ఇదేంటి మా పిల్లలు చదువుకోమని పంపిస్తే ఈ పని చేస్తున్నారని ఒక్క సారిగా పేరెంట్స్ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత విద్యార్థులను సమాచారం అడిగి తెలుసుకుని ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఘటన చూసిన వారు తమ పిల్లలను బడికి పంపుతున్నామ లేక పనికి పంపుతున్నమా అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటి వద్ద వారికి ఎలాంటి పని చెప్పకుండా అల్లారు ముద్దుగా పెంచుకుంటుంటే మీరు మాత్రం ఇలాంటి పనులు చెప్పడం ఎంత మాత్రం బాగా లేదని అసహనం వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు దీనిపై స్పందించాలన్నారు. పుస్తకాలు చేత పట్టుకోవాల్సిన సమయంలో దుంగలు మోయించాల్సిన అవసరం ఎందుకు ఏర్పడిందో విద్యా శాఖ అధికారులు విచారణ చేపట్టాలన్నారు. ఈ సంఘటనకు బాధ్యులైన వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.


